ఆ టీడీపీ లేడీ లీడ‌ర్ ఏడుపుకు కార‌ణం ఇదే..!

VUYYURU SUBHASH
రాజ‌కీయ నేత‌లు గొంతెప్పుడు ఎత్తుతారు? అంటే.. ఓ సీనియ‌ర్ అయిన రాజ‌కీయ నాయ‌కుడు ఓ మాట చెప్పాడు..``మాకు కింద పైన కాలిన‌ప్పుడు!``అని! అచ్చు ఈ వ్యాఖ్య‌ల‌ను నిజం చేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.. ఇటీవ‌ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి. త‌న‌కు పార్టీలో గుర్తింపు లేకుండా పోయింద‌ని, అదికారుల‌ను బ‌దిలీ చేస్తున్న‌ప్పుడు కూడా త‌న‌కు చెప్ప‌డం లేదని, ఆమె మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావుపై తీవ్ర‌స్థాయి లో ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌కు అడుగడుగునా అవ‌మానాలే జ‌రుగుతున్నాయ‌ని ఆమె క‌న్నీరు సైతం పెట్టుకున్నారు. అయితే, విష‌యం మాత్రం అది కాద‌ని, ప్ర‌తిభా భార‌తి గ‌ళం విప్ప‌డానికి ఉన్న రీజ‌న్ వేరే ఉంద‌ని చెప్పుకొచ్చారు నాయ‌కులు. ఇక్క‌డ ఆమె ప్లేట్ ఫిరాయిస్తోంద‌ని అందుకే ఆమె అరుపులు, కేక‌లు పెట్టార‌ని వారు పేర్కొన్నారు. 


విష‌యంలోకి వెళ్తే.. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా జిల్లాను శాసించిన నాయకులు.. ఇప్పుడు.. తమ రాజకీయ భవిష్యత్‌ కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌లో గతంలో మంత్రులుగా పనిచేసిన కోండ్రు మురళీమోహన్ ఇప్పుడు అధికార టీడీపీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన... కోండ్రు కాంగ్రెస్‌లో బాగానే చ‌క్రం తిప్పారు. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌డంలోనూ ఆయ‌న గ్రేట్ అని అనిపించుకున్నారు. అయితే, విభ‌జ‌న‌తో నామ రూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ నుంచి ఆయ‌న బ‌య‌ట‌ప‌డ్డారు. 


ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో టీడీపీ వైపు మొగ్గుతున్నారు.  ఆయన రాకను టీడీపీలోని ఓ వర్గం ఆహ్వానిస్తుండగా, మాజీ మంత్రి ప్రతిభా భారతి వర్గం మాత్రం వ్యతిరేకిస్తోందట. మాజీమంత్రి పత్రిభా భారతి... కోండ్రును పార్టీలో చేర్చుకోవద్దని, ఆయన వస్తే.. తనకు ఇబ్బంది అవుతుందని పార్టీ అధినేత వద్ద చెబుతున్నారట. సుధీర్ఘకాలం తనకు వ్యతిరేకంగా పోరాడిన మాజీ మంత్రి కోండ్రును పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆమె ప్రశ్నిస్తున్నారట. 2004లో ఎచ్చెర్లలో, 2009లో రాజాంలో ఆమె మురళీమోహన్‌ చేతిలో ఓడిపోయారు. ఐదుసార్లు ఎచ్చెర్లలో వరుసగా గెలిచిన ప్రతిభ తరువాత వరుసగా ఓటములు చెందడంతో.. . నియోజకవర్గంలో పట్టుకోల్పోయారు. 


దీంతో.. రాజాంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తుండడంతో... కోండ్రుకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఆయనైతే.. వైసీపీకి గట్టిపోటీ ఇస్తారని, ఎస్సీల్లో బలమైన నాయకుడిగా ఆయన ఉన్నారని, ఆయనను పార్టీలో చేర్చుకోవాలని పెద్ద ఎత్తున నాయ‌కులు కోరుతున్నారు. ఈయ‌న‌కు క‌ళా వెంక‌ట్రావు ప‌రోక్షంగా సాయం చేస్తున్నార‌ని స‌మాచారం. మొత్తానికి ప్ర‌తిభా భార‌తి ఏడుపు వెనుక రీజ‌న్ ఇదీ!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: