నాగం కాంగ్రెస్ ఎంట్రీకి బ్రేక్ వెన‌క అస‌లు రీజ‌న్ ఇదా..!

VUYYURU SUBHASH
అంతర్గత కుమ్ములాటలే హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నాయా..? సులభంగా గెలిచే స్థానాల్లోనూ ఓడిపోవడానికి కారణం ఇదేనా..? అంటే నిజమేననే సమాధానం గత అనుభవాలు టక్కున చెప్పేస్తాయి. వచ్చినోళ్లను వచ్చినట్టు అధికార టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటుంటే కాంగ్రెస్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో  పెద్ద దుమారం రేపుతోంది. కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. 


మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, డీకే అరుణ మధ్య వర్గపోరు నడుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దంటూ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తో కలిసి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానిక నాయకులతో నాగానికి తీవ్ర విభేదాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ లోకి వస్తే నష్టం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. స్థానిక నాయకులకు సంబంధంలేకుండానే ఇతర పార్టీల వారిని చేర్పించుకోవడం మంచిది కాదని అన్నట్లు ప్రచారం జరుగుతోంది. 


మరోవైపు డీకే అరుణ జిల్లాలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారనీ, ఆమె టీపీసీసీ పదవి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే తన ఆధిపత్యానికి అడ్డుపడతారనీ, అందుకే ఆయనను పార్టీలోకి రానివ్వకుండా ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొందరు నేతలు ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే నాగం జనార్దన్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని, ఆయనతో పార్టీ కి నష్టమేగాని లాభం మాత్రం ఉండదని పలువురు నేతలు అంటున్నారు. 


ఇక నాగం పార్టీలోకి వ‌స్తే ఆయ‌న‌పై గ‌తంలో ప‌లుసార్లు పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్‌రెడ్డి త‌న‌కు ఇబ్బంది అవుతుంద‌ని భావిస్తున్నారు. నాగం వ‌స్తే నాగ‌ర్‌క‌ర్నూల్ అసెంబ్లీ సీటు త‌న‌కు కాని లేదా త‌న త‌న‌యుడికి కాని ఇప్పించుకోవాల‌ని చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఫెయిల్ అవుతాయ‌న్న టెన్ష‌న్‌లో ఆయ‌న ఉన్నారు. ఏదేమైనా నాగం లాంటి సీనియ‌ర్ లీడ‌ర్ పార్టీలోకి వ‌స్తున్నా కాంగ్రెస్ మాత్రం దానికి క్యాష్ చేసుకోలేక‌పోతోంది. ఇక కాంగ్రెస్ మాత్రం తన సహజ శైలిని వీడకుండా అంతర్గత కలహాలతో ఓటమిని కొనితెచ్చుకుంటుందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: