తెలంగాణలో గతేడాది దసరాకు సీఎం కేసీఆర్ తెలంగాణ 10 జిల్లాలను ఏకంగా 31 జిల్లాలుగా విభజించారు. అడిగిన వాళ్లకు అడిగినట్టు కేసీఆర్ జిల్లాలను ఇష్టారాజ్యంగా విభజించేశారు. ఒక్కో జిల్లాను రెండు, మూడుగా, నాలుగుగా విభజించేశారు. వరంగల్ జిల్లా అయితే ఏకంగా ఐదు ముక్కలైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా విడిపోయింది. ఈ జిల్లాల పునర్విభజనపై విపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
తన కుటుంబ సభ్యులకు కావాల్సినట్టుగా సిద్ధిపేట, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలను ఆయన విభజించేశారన్న విమర్శలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం కొన్ని జిల్లాలను రద్దు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం ఐదు జిల్లాలను రద్దు చేసే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముందుగా రెండు జిల్లాలను రద్దు చేస్తే, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా ఉండదని ఇంటిలిజెన్స్ రిపోర్టులు ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఆ రెండు జిల్లాల్లో వరంగల్ రూరల్ జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లాల పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరలేదు. మొదటి నుంచి కూడా ఈ జిల్లా ఏర్పాటుపై ప్రజల్లోనే స్పందన లేదు. అసలు వరంగల్ రూరల్ జిల్లా వద్దని కూడా చాలా మంది వ్యతిరేకించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అనూహ్యంగా రూరల్ జిల్లా ఏర్పాటు చేసింది. భౌగోళికంగా కూడా ఈ జిల్లా గందరగోళంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ఇక జనగామ జిల్లా కూడా రద్దు చేస్తారని వార్తలు వచ్చినా అది కష్టమే. జనగామ జిల్లా కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అక్కడ కలెక్టరేట్, ఇతర శాఖల భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరో టాక్ ఏంటంటే యాదాద్రి భువనగిరి, జనగామను కలిపి జిల్లా కేంద్రంగా జనగామను ఉంచే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందట.
ఇదిలా ఉంటే పాత కరీనగర్ జిల్లా నుంచి విభజించిన పెద్దపల్లి జిల్లా కూడా అనవసరం అన్న భావనలో ప్రభుత్వం ఉందట. ఈ జిల్లాను రద్దు చేసినా కూడా ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా ఉండదనే భావనలో ఉన్న ప్రభుత్వం ఈ జిల్లాను కూడా కరీంనగర్‌లో వీలనం చేయాలని ఇంటిలిజెన్స్ రిపోర్టులు వెళ్లినట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ ఈ రెండు జిల్లాలనే రద్దు చేస్తారా ? లేదా ? అన్నది ఆయన చేతుల్లోనే డెసిషన్ ఉంది.