హిమాచల్‌ ప్రదేశ్‌లో..ఓటేసిన భారత తొలి ఓటరు..!

Edari Rama Krishna
హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో భారత తొలి ఓటరు శ్యాం శరణ్‌ నేగి ఓటు వేశారు. కల్పా పోలింగ్‌ కేంద్రంలో నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్నాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు 54.9 శాతం ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నార‌ని ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.  మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు తొలిసారిగా 1952 ఫిబ్రవరిలో జరిగాయి.

అయితే ఆ సమయానికి విపరీతంగా మంచు కురిసే అవకాశం ఉండటంతో 5నెలల ముందే హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి మహాసు పార్లమెంటరీ నియోజకవర్గానికి(ప్రస్తుతం మండి) జరిగిన ఎన్నికల్లో నేగి(1951 అక్టోబర్ 25న) తన ఓటు హక్కును వినియోగించుకుని, దేశంలోనే తొలి ఓటు వేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నేగి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసి, 1975లో ఉద్యోగ విరమణ చేశారు.

కల్ప పోలింగ్‌ కేంద్రం వద్ద నేగి కోసం ప్రత్యేకంగా ఎర్ర తివాచీని కూడా ఏర్పాటు చేశారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను పోలింగ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్లేలా కిన్నౌర్‌ జిల్లా పాలనా యంత్రాంగం, ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని లోక్‌సభ ఎన్నికలతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ శ్యామ్ నేగి తన ఓటుహక్కు వినియోగించుకోవడం మరో విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: