ఎడిటోరియల్: ఇదే మోడీ ముందున్న స‌వాల్...?

DSP
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గ‌త రెండున్నరేళ్ల కాలంలో దౌత్యం వ్యూహాల‌కు ఎంత‌గా ప‌రిత‌ప్పించారో ప్ర‌త్యేకంగా చెప్పన‌క్క‌ర్లేదు. ప్ర‌పంచ దేశాలకు తిరిగి రావ‌డంలో ప్రధాని న‌రేంద్రమోడీ చేసినంత‌గా ఏ ప్ర‌ధాని చేయ‌లేద‌నే చెప్పొచ్చు. ఆయ‌న ఎక్కువ శాతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఎదురుకున్నారు. ఆయ‌న దౌత్యం ఫ‌లించిందా? ఆయ‌న చేసిన విదేశీ ప్ర‌యాణాలు ఏమైన ప‌నికి వ‌చ్చాయా? అంటే ఇంత వ‌ర‌కు ప‌రీక్షించుకునే స‌మ‌యం రాలేదు. తాజాగా ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. దాయాది దేశ‌మైన పాకిస్థాన్ తో దౌత్య సంబంధాల‌ను కొన‌సాగించాల‌న్న మోడీ ఆశ‌లు అడియాశ‌లుగానే మిగిలాయని చెప్ప‌క త‌ప్ప‌దు.  

ఉరీ పై ఉగ్ర‌దాడి పై మోడీ సీరియ‌స్

పాకిస్థాన్ తో స్నేహం కోసం న‌రేంద్ర మోడీ ప‌దే ప‌దే ప్ర‌య‌త్నిస్తుంటే... పాకిస్థాన్ మాత్రం త‌న వ‌క్ర బుద్ది ని మార్చుకోలేదు. ఒక‌వైపు స్నేహ సంబంధాలంటూ చేతులు క‌లుపుతూనే మరోవైపు సైనికుల‌పై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతుంది. తాజాగా క‌శ్మీర్ లోని ఊరి సెక్టార్ పై పాక్ టెర్ర‌రిస్టుల దాడికి దిగి 18 మంది భారత సైనికుల‌ను పొట్ట‌న‌పెట్టుకుంది.  ఈ దాడితో భార‌త్ , పాకిస్థాన్ దేశాల మ‌ధ్య భారీగా మాటల  యుద్దం కొన‌సాగుతూనే ఉంది. టెర్ర‌రిజాన్ని నిర్మూలించి పాకిస్థాన్ ను దారికి తీసుకొచ్చే స‌త్తా ఉన్నా నాయకుడిగా 2014 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా పేరు తెచ్చుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఇప్పుడు అస‌లైన అగ్ని ప‌రీక్ష ఎదురైంద‌నే చెప్పాలి. 

పాకిస్థాన్ కు బుద్ది చెప్పాల‌ని మోడీ వ్యూహం

స‌రిహ‌ద్దుల గుండా టెర్ర‌రిజాన్ని ప్రొత్స‌హిస్తున్న పాకిస్థాన్ కు ఎలా బుద్ది చెప్పాల‌న్న అంశం పై ఆయ‌న సంబంధిత రంగాల నిపుణుల‌ను.. స‌లహాదారుల‌తో స‌మాలోచ‌న‌లు సాగిస్తున్నారు. ఉరీ దాడి నేపథ్యంలో.. పాక్‌తో ‘కంటికి కన్ను పంటికి పన్ను’ తరహాలో వ్యవహరించాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో... ఈ అంశంపై ప్రధాని మోదీ బుధవారం రోజంతా వార్‌ రూమ్‌ లో అత్యున్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. వార్‌రూమ్‌గా వ్యవహరించే ఈ అత్యంత రహస్యమైన కార్యాలయం నుంచే రక్షణ శాఖ అన్ని భద్రతాపరమైన అంశాలనూ పర్యవేక్షిస్తుంది. రాత్రి పొద్దుపోయేదాకా.. ఆ రూమ్‌లోనే ఉన్న పీఎం బుధవారం నాడూ భద్రత వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీతో అక్కడే రెండుసార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. 

ఉరీ పై ఆర్మీ చీప్ తో మోడీ చ‌ర్చ‌

ఉరీ దాడికి ఎలా స్పందించాలో కేంద్ర కేబినెట్‌లోని కీలక మంత్రులతో, ఆర్మీ చీఫ్‌తో కార్యాచరణపై చర్చించారు. మ్యాప్‌లు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, సైకత నమూనాల ఆధారంగా మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఆయనకు పలు వివరాలు తెలియజేసినట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి పాకిస్థాన్‌కు శాశ్వతంగా గుణపాఠం చెప్పేందుకు సమాలోచన లతో కాలయాపన చేయడం కంటే కదన రంగానికి కాలు దువ్వడమే మంచిదనే వాదన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ‘పాకిస్ధాన్‌తో స్నేహం కోసం నరేంద్ర మోదీ పదే పదే ప్రయత్నించి అలసిపోయారు. క‌శ్మీర్ పై ఆధిప‌త్యం కోసం ప‌రితప్పిస్తున్న పాక్ లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గ‌తేడాది డిసెంబ‌ర్ మాసం లో ఆక‌స్మిక ప‌ర్య‌టించారు కూడా. ఆయ‌న దాదాపుగా మూడు గంట‌ల పాటు పాకిస్థాన్ లో గ‌డిపారు. పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీష్ ను క‌లుసుకున్నారు. 

పాక్ లో మోడీ అక‌స్మీక ప‌ర్య‌ట‌న‌

అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా... ఆయ‌న ప‌ర్య‌ట‌న ఇరు దేశాల దౌత్య సంబంధాలు మెరుగు ప‌డతాయ‌ను కుంటే... అది జ‌రగ‌లేదు. అయితే ఇక్క‌డ ట్వీస్ట్ ఏమిటంటే... ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ వ్య‌క్తిగ‌తంగా న‌వాజ్ ష‌రీప్ ను క‌లిసి ఆయ‌న పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియాడానికే వెళ్లారా? అన్న ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్న‌మైంది. రెండు దేశాల సంబంధాలు అంతం మాత్రంగానే ఉన్న త‌రుణంలో దానికి కాస్త నాట‌కీయ‌త‌ను జోడిస్తూ కాబూల్ నుంచి ట్వీట్ చేసిన ప్ర‌ధాని మోడీ... ఢిల్లీ తిరిగి వెళ్లేట‌ప్పుడు పాక్ కు వెళ్లి... ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీప్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ నున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌లనం సృష్టించారు. న‌రేంద్ర‌మోడీ శాంతి కోసం ప్రయత్నించినప్పుడల్లా వారు టెర్రరిస్టు దాడులతో సమాధానం ఇచ్చారు. 

సాయుధ ద‌ళాల‌తో టెర్ర‌రిజాన్ని అణ‌చివేయాల‌ని డిమాండ్

పాకిస్తాన్‌పై భారత్‌ యుద్ధం చేసేందుకు మెజారిటీ దేశ ప్రజల మద్దతు కూడా ఉందని ‘ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌’ ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించిన విషయం తెల్సిందే. సాయుధ దళాలతోనే టెర్రరిజాన్ని అణచివేయాలని 62 శాతం మంది ప్రజలు తమ సర్వేలో అభిప్రాయపడ్డారని ఆ సెంటర్‌ సోమవారం నాడు ప్రకటించింది. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఏదిఏమైనా న్యూయార్క్‌లో ఈ వారంలో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉపయోగించుకొని ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టాలని, దౌత్యపరంగా ఒంటరిదాన్ని చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలని, ముఖ్యంగా ముందుగా పాకిస్థాన్‌తోని అన్ని వాణిజ్య, జల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిపుణులు, సలహాదారులు ప్రధానికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. 

క‌శ్మీర్ స‌మస్య‌పై వాజ్ పేయ్, మ‌న్ మోహ‌న్ సింగ్ ప్ర‌య‌త్నాలు...

గత పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌ పట్ల అప్పటి యూపీఏ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించిన నరేంద్ర మోదీ గ‌తంలోనే ఆరోపించారు. వాస్త‌వానికి  క‌శ్మీర్ లోని మెజారిటీ ప్ర‌జ‌ల  అభిప్రాయం ప్ర‌కారం వారు కోరుకుంటున్న‌ది ఆజాది  త‌ప్ప పాకిస్థాన్ అంత‌ర్భాగం కావాల‌న్న‌ది కాదు. మ‌న దేశం కన్నాఎంతో వెన‌క‌బ‌డిన పాకిస్థాన్ లో అంత‌ర్భాగం కావాల‌ని వారు కోరుకంటే అది వారి క‌ర్మ అని మిగులుతాయి క‌దా. అందుకు ఒప్పుకోం మ‌న మ్యాప్ లో మార్పు రాకూడ‌దు. క‌శ్మీర్ స‌మ‌స్య‌ను శాశ్వాతంగా ప‌రిష్క‌రించేందుకు గ‌తంలో ఎన్నో సార్లు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ ఫ‌లితం ల‌భించ‌లేదు.  ఇటీవ‌లి కాలంలో అట‌ల్ బిహారి వాజ్ పేయి, మ‌న్మోహాన్ సింగ్ లు , ప్రధాన మంత్రిగా ఉన్న‌ప్పుడు కాస్త చిత్త‌శుద్దితోనే ప్ర‌య‌త్నాలు కొన‌సాగాయి. 

మోడీ నిర్ణ‌యంపై అంద‌రి దృష్టి

శాంతి సరిహద్దుల పేరిట క‌శ్మీర్ లోకి ఇరు దేశాల‌కు స‌మాన యాక్సెస్ ఉండేలా పాకిస్థాన్ తో మ‌న్మోహ‌న్ సింగ్ ఓ ప్ర‌తిపాద‌న చేశారు. ఇసుంట ర‌మ్మంటే ఇల్లంతా త‌న‌దంటుందేమో అన్న భ‌యంతో మ‌న్మోహాన్ ముందుగా వెన‌క‌డుగు వేశారు. ఆ త‌రువాత పాకిస్థాన్ కూడా వెన‌క్కి త‌గ్గింది. క‌శ్మీర్ పూర్తి స్వాతంత్య్రం ఇవ్వ‌క‌పోయినా పూర్తి స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పిస్తే క‌శ్మీర్ లో శాంతియుత ప‌రిస్థితులు నెలకొంటాయ‌ని మేథావులు, చ‌రిత్ర‌కారులు ఎప్ప‌టి నుంచో చెబుతున్న అంశం. మరి ఇప్పుడు బలమైన నాయకుడిగా ఆవిర్భవించిన మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: