రోజా కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో..!?

Chakravarthi Kalyan
రోజా.. ఈమె ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే.. ఈ సంగతి అందరికీ తెలుసు.. అంతకు ముందే ఆమె హీరోయిన్ గా దక్షిణ భారతదేశమంతా పాపులర్.. సినిమాల తర్వాత బుల్లితెరపైనా రోజా తనదైన ముద్రవేస్తున్నారు. జబర్దస్త్ రోజాగానూ పేరు తెచ్చుకున్నారు. ఇన్ని విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఏ సందర్భంలోనూ ఆమెను రోజా రెడ్డిగా సంబోధించిన దాఖలాలు లేవు. 

కానీ వాస్తవానికి ఆమె రోజా రెడ్డే.. కానీ అంతకుమించి ఆమెను పిలవాలంటే రోజా సెల్వమణి అనిపిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే భర్త పేరు చివరన పిలవడం కూడా ఓ సాంప్రదాయం కాబట్టి. సో.. రోజాను పిలిచేందుకు మనకు ఇన్ని ఛాన్సులున్నాయి.. రోజా, ఎమ్మెల్యే రోజా, జబర్దస్త రోజా, రోజా సెల్వమణి, రోజారెడ్డి.. వీటన్నింటిలోనూ టీడీపీ నేతలకు ఇప్పుడు రోజారెడ్డి అనే పేరే బాగా ఇష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది. 

గతంలో లేదు కానీ.. ఇటీవల ఎందుకో టీడీపీ నేతలు ట్రెండ్ మార్చారు. రోజాను విమర్సించేటప్పుడు రోజా అని కాకుండా రోజారెడ్డి అంటూ సంభోదిస్తున్నారు. మొన్నటికి మొన్న మీడియా పాయింట్ లో అనిత రోజాను విమర్సిస్తూ పదే పదే రోజా రెడ్డి.. ఆ రోజా రెడ్డి అంటూ మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా ఇటీవల రోజాను రోజా రెడ్డి అంటూ విమర్శిస్తున్నారు. 

మరి ఉన్నపళంగా టీడీపీ నేతలకు రోజా కులం ఎందుకు గుర్తొస్తోంది.. రోజా కామెంట్లకు బాధితురాలనినయ్యానంటున్న అనిత దళితురాలు కనుక.. రోజా అగ్రకుల అహంకారం ప్రదర్శించింది.. అనే విషయాన్ని హైలెట్ చేయడం కోసం పదే పదే రోజా రెడ్డి అంటున్నారా.. పదే పదే ఆమె రెడ్డి అని తెలిసేలా మాట్లాడటం ద్వారా బడుగు బలహీన వర్గాల్లో రోజాపై వ్యతిరేకత రావాలని ప్రయత్నిస్తున్నారా.. అన్నది అర్థంకాని విషయం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: