బెంగుళూరు : షర్మిల డీకేని ఎందుకు కలుస్తున్నారు ?

Vijaya



వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం చాలా అనుమానాస్పదంగా ఉన్నది. ఒకవైపు ఏ పార్టీతోను పొత్తుండదని బల్లగుద్ది చెబుతునే మరోవైపు కర్నాటక డిప్యుటి సీఎం డీకే శివకుమార్ ను కలుస్తున్నారు. గడచిన రెండువారాల్లో డీకేని షర్మిల కలవటం ఇది రెండోసారి. బెంగుళూరులో ఉన్న డీకేని షర్మిల సోమవారం కలిశారు. రెండువారాల్లో డీకేని షర్మిల ఎందుకు కలిశారన్నదే పెద్ద ప్రశ్నగా మారిపోయింది.



తెలంగాణాలో షర్మిల పార్టీ విషయంలో జనాలు పెద్దగా సానుకూలంగా లేరని అందరికీ తెలిసిందే. ఆ పార్టీలో షర్మిల తప్ప రెండోనేతే జనాలకు తెలీదు. ఈ పరిస్ధితుల్లో వచ్చేఎన్నికల్లో షర్మిల పార్టీ పోటీచేస్తుందని కూడా ఎవరికీ నమ్మకాలు లేవు. కానీ షర్మిలేమో 43 నియోజకవర్గాల్లో గట్టి ప్రభావం చూపిస్తుంది తమపార్టీ అని చెబుతున్నారు. ఢిల్లీలోని ఒక సంస్ధతో సర్వేచేయిస్తే ఈ విషయం తెలిసిందని స్వయంగా షర్మిలే చెప్పారు.



అంటే దానర్ధం 43 సీట్లలో పార్టీ పోటీచేస్తుందనా ? లేకపోతే తమకు 43 సీట్లలో పట్టుందని అన్నీ పార్టీలకు తెలియజేయటమా ? అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. పనిలోపనిగా ఇదే సమయంలో తనపార్టీ ఏ పార్టీలోను విలీనం కాదని, ఏ పార్టీతోను పొత్తుపెట్టుకోదని కూడా చెప్పారు. అదే నిజమైతే మరెందుకు డీకే రెగర్యులర్ గా షర్మిల కలుస్తున్నారు ? ఇప్పటికే జరుగుతున్న ప్రచారం ఏమిటంటే తెలంగాణా కాంగ్రెస్ కు షర్మిల పార్టీకి పొత్తుంటుందని. తెలంగాణాలో పొత్తు పెట్టుకునేట్లు, ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిలచేతికి అప్పగించేట్లుగా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే.



కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఇప్పటికే ఈ విషయమై షర్మిలతో చర్చలు కూడా జరిపారని ప్రచారంలో ఉంది. ప్రియాంక ప్రతిపాదనకు షర్మిల కూడా సానుకూలంగానే ఉన్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే షర్మిల బెంగుళూరు వెళ్ళి డీకేని కలుస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు డీకే అత్యంత సన్నిహితుడు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో డీకే పాత్రకూడా చాలా కీలకమే. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిలకు మధ్య డీకేనే రాయబారం నడుపుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: