అమరావతి : చంద్రబాబు-పవన్ మధ్యలో జగన్ ఇరుక్కున్నారా ?

Vijaya


మిత్రులిద్దరు వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దండెత్తుతునట్లున్నారు. ఇక్కడ మిత్రులంటే టీడీపీ, జనసేన మిత్రపక్షాలని కాదర్ధం. జగన్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకోసం పోరాటం చేయాలని ఇద్దరు చేతులు కలిపారు కాబట్టే మిత్రులన్నది. మూడురోజుల కుప్పం పర్యటనలో అడుగడుగునా చంద్రబాబునాయుడు నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి సవాలు విసిరారు. రోడ్డుషోలు, రోడ్డుపైన సభలు, ర్యాలీలను నిషేధిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను తాము పాటించేది లేదని ఇప్పటికే చంద్రబాబు, పవన్ ప్రకటించేశారు.ప్రకటించటమే కాకుండా కుప్పంలో చంద్రబాబు ఆచరణలో చూపించారు. ర్యాలీలు నిర్వహించారు, రోడ్డుషో కూడా చేశారు. రోడ్డుమీద నిలబడే మైకులో పోలీసుల ముందే మాట్లాడారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబుకు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని తెలియకపోవటమే విచిత్రంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయం నిజంగానే తమ స్వేచ్చను హరించేట్లుగా ఉంటే కోర్టుకెళ్ళాలి. అంతేకానీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవించనని చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది.ఇక పవన్ కల్యాణ్ విషయంచూస్తే ఈనెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్ధలం మండల కేంద్రంలో భారీ బహిరంగసభ పెట్టబోతున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతించింది లేంది తెలీదు. బహిరంగసభ వేదిక రణస్ధలం అని చెబుతున్నారే కానీ రణస్ధలంలో ఎక్కడన్నది చెప్పలేదు. మరి నిర్వాహకులు వేదికను ఎక్కడ పెట్టుకుందామని అనుకున్నారో దానికి పోలీసుల అనుమతి ఉంటుందో ఉండదో. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా బహిరంగసభను జరిపి తీరాలని పవన్ కూడా డిసైడ్ చేసుకున్నారేమో.అంటే ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్ ఇద్దరూ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించటం ద్వారా జగన్ను ఇరుకునపెట్టాలని అనుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వైఖరి చూస్తే తన పర్యటనల్లో ఎక్కడ కూడా ప్రభుత్వ అనుమతి తీసుకునేట్లు లేరు. పవన్ కూడా చంద్రబాబునే ఫాలో అయితే ఇక ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ప్రతిపక్షాలకు పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతునే ఉంటాయి. మరి జగన్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: