అమరావతి : మొహంలో గెలుపుధీమా ఎక్కడైనా కనిపిస్తోందా ?

Vijaya

వచ్చేఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామని చంద్రబాబునాయుడు చాలా గంభీరంగా చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణాలో కూడా పోటీచేస్తామన్నారు. ఏపీలో కన్నా తెలంగాణాలోనే పార్టీ చాలాబలంగా ఉండేదని కాకపోతే రాజకీయ పరిణామాల కారణంగా తెలంగాణాలో బలహీనపడిపోయినట్లు తెగ బాధపడిపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపీలో గెలుస్తామని చెప్పినపుడు చంద్రబాబు మొహంలో గెలుపు ధీమా కనబడలేదు. అలాగే తెలంగాణాలో  పోటీచేస్తామని చెబుతున్నారు కానీ అంత ధైర్యం చేస్తారని ఎవరు అనుకోవటంలేదు.



కారణం ఏమిటంటే మొన్ననే జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా ముందు పోటీచేయాలని డిసైడ్ చేశారు. ఉపఎన్నికలో పోటీచేస్తే పార్టీ పరిస్ధితిపై ఒక అంచనాకు రావచ్చని నేతలంతా చాలాసార్లు చెప్పిన తర్వాత చివరకు చంద్రబాబు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తర్వాత ఏమైందో ఏమో మరుసటి రోజే నేతలందరినీ పిలిచి ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని చెప్పారు. కేసీయార్ దెబ్బకు తెలంగాణాలో పోటీచేయాలంటేనే చంద్రబాబు భయపడిపోతున్న విషయం అర్ధమవుతోంది.



అందుకనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీచేస్తుందని చెప్పిన  చంద్రబాబు మాటలపై చాలామందికి నమ్మకంలేదు. అంతెందుకు ఈనెల 21వ తేదీన ఖమ్మంలో జరగబోయే బహిరంగసభకు చంద్రబాబు హాజరయ్యేదే అనుమానంగా ఉంది. తెలంగాణాలో పోటీచేయాలంటే ఏమని ప్రచారం చేయాలి ? ఎవరిని టార్గెట్ చేయాలన్నదే టీడీపీకి ప్రధానమైన సమస్య. బీజేపీ, టీఆర్ఎస్ ను టార్గెట్ చేయలేరు. కాంగ్రెస్ ను టార్గెట్ చేసి ఉపయోగంలేదు.



ఇక ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పటం ఏదో మేకపోతు గాంభీర్యంలాగే ఉంది. ఒంటరిపోటీకి చంద్రబాబు భయపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. గెలుపుమీద అంత నమ్మకమే ఉంటే తనను గెలిపించకపోతే రాబోయేవే చివరి ఎన్నికలంటు ఎందుకు భోరుమన్నట్లు ?  అందుకనే పొత్తుల కోసం అవస్తలు పడుతున్నారు. ఓట్లు చీలిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తారని స్వయంగా చంద్రబాబే బహిరంగంగా చెప్పారు. ఒంటరిపోటీయా లేకపోతే పొత్తులా అన్నదే తేల్చుకోలేని చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తామని చెబితే ఎవరు నమ్ముతారు ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: