అవును మా జగన్ కమల్ హాసనే.. అంబటి వ్యాఖ్యలు..

Deekshitha Reddy
ఇటీవల వరద పరామర్శలకోసం వెళ్లిన చంద్రబాబు.. సీఎం జగన్ పై తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కోడికత్తి కమల్ హాసన్ అంటూ సెటైర్లు వేశారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. సీఎం జగన్ కమల్ హాసనే అంటూ అంబటి, చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. కానీ ఆయన కోడికత్తి కమల్ హాసన్ కాదని, భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ అంటున్నారు. చంద్రబాబులాంటి వారి ఆట కట్టించడానికి భారతీయుడు రూపంలో వచ్చిన హీరో అని అన్నారు అంబటి.
చంద్రబాబు వల్లే పోలవరం నాశనం..
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పోలవరం హాట్ టాపిక్ గా మారింది. గోదావరి వరదల వల్ల పోలవరం మునిగిపోయిందని, ఈపాటికే అక్కడ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని, జగన్ కి చేతకాకపోతే తప్పుకోవాలని, తాను పోలవరం డ్యామ్ పూర్తి చేసి చూపిస్తానన్నారు చంద్రబాబు. పోలవరం పూర్తి చేయడానికి ఆయన అధికారంలోకి రావడానికి సంబంధం ఏంటని..? అసలు సీఎం పదవి ఇలా దిగిపోతే అలా ఎక్కేసే పదవా అని ప్రశ్నించారు అంబటి. ఐదేళ్లు తమకి ప్రజలు అధికారమిచ్చారని అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు అంబటి. గతంలో కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారని, అందుకే అది వరదలకు కొట్టుకుపోయిందని చెప్పారు. జాతీయ ప్రాజెక్ట్ ని తాను నిర్మిస్తానంటూ తీసుకున్న చంద్రబాబు, కమీషన్లు మేసేశారని, ఇప్పుడు పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.
వరదలు, కరువులకు చంద్రబాబే ఆద్యుడని సెటైర్లు వేశారు అంబటి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ఆయన, వరదలకంటే ముందే తాను వస్తానంటూ చెప్పుకుంటున్నారని, అది నిజమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వచ్చి వెళ్లిపోయిన తర్వాతే వరదలు, కరువు వస్తాయని అన్నారు. చంద్రబాబు జీవితంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఆయనకు వయసు పైబడటం వల్ల బయటకు వస్తే నడుం నొప్పి వస్తుందని, కానీ ఆయన ఏపీ రోడ్లపై తిరిగితే నడుం నొప్పి వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఏపీలో చంద్రబాబు, లోకేష్ మినహా మిగతా ప్రజలంతా సంతోషంగా ఉందన్నారు అంబటి రాంబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: