చిరంజీవిని టార్గెట్ చేసిన అశ్వినీదత్..

Deekshitha Reddy
చిరంజీవి, ఏపీ సీఎం జగన్ ని కలవడం పార్టీలపరంగా చాలామందిని ఇబ్బందికి గురి చేసిన మాట వాస్తవమే. ఆ మాటకొస్తే జనసేన నేతలు, జనసైనికులు కూడా కాస్త బాధపడ్డారు. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా ఆ భేటీపై అక్కసు ఉన్నట్టు ఆ తర్వాత క్రమక్రమంగా బయటపడుతోంది. అప్పట్లో మోహన్ బాబు కూడా చిరు-జగన్ భేటీపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్మాత అశ్వనీదత్ సంచల వ్యాఖ్యలు చేశారు. స్టార్లు వెళ్లి సీఎంలను కలవడం, సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం ఎప్పుడూ లేదని, ఏదైనా ఉంటే నిర్మాతలు, దర్శకులు చూసుకునేవారని, కానీ ఇప్పుడా సంప్రదాయం లేదని, అందుకే ఈ సమస్య అంతా అని అన్నారు.
ఏపీ ప్రభుత్వంపై నేరుగా, మెగాస్టార్ చిరంజీవిపై పరోక్షంగా నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలపై కూడా ఆయన అందరిదీ తప్పంటూ కుండబద్దలు కొట్టారు. కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతలకు సవాల్‌ గా మారిందని అన్నారు అశ్వనీదత్. ఒకరకంగా సినిమాలపై ప్రేక్షకులకు విరక్తి వచ్చిందని, అందుకు కారణం సినిమావాళ్లేనన్నారు. తమకు గిట్టుబాటు కావట్లేదని సినిమా టికెట్ల ధరలను పెంచాలని ఒకసారి, కలెక్షన్లు తగ్గిపోయాయని, జనాలు రావట్లేదనే కారణాలు చెప్పి టికెట్ రేట్లు తగ్గించాలని మరోసారి కోరడంతో గందరగోళం ఏర్పడిందని చెప్పారు. దానివల్లే ప్రజల్లో విరక్తి వచ్చిందని అన్నారు అశ్వనీదత్. ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడి, సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడం కూడా ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం అని అన్నారు అశ్వనీదత్.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉందిగా..!
గతంలో సమస్యలు వస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ పరిష్కరించేదని, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ ఎందుకని అశ్వనీ దత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేది ఏం చేస్తుందో, తనకు అర్థం కావడం లేదని అన్నారు. హీరోలకు అధిక రెమ్యునరేషన్ ఇస్తున్నారని, అందుకే సినిమా టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తోందన్న వాదనలో వాస్తవం లేదని చెప్పారు అశ్వనీదత్. పరోక్షంగా హీరోలకు మద్దతిచ్చారు. మార్కెట్‌ కు అనుగుణంగానే హీరోలు తమ రెమ్యనరేషన్ తీసుకుంటారని, అవసరమైతే పెంచుతారని చెప్పారు.
అటు తిరుమలపైనా నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని తొలగించాల్సి వస్తే విమర్శలు వచ్చాయని, కానీ ఆ రోజు అంతా శాస్త్రం ప్రకారమే చేశామని వివరించారు. ప్రస్తుతం వైసీపీ హయాంలో మూడేళ్లలో తిరుమలలో జరగని పాపమంటూ లేదని చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఈ పాపం చూస్తూ ఉన్నారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: