వైజాగ్ లో సీ ఎం జగన్ కి నిరసన సెగ తగులుతుందా..?

Deekshitha Reddy
సీఎం జగన్ ఈరోజు విశాఖ పట్నం పర్యటనకు వెళ్తున్నారు. వాహనమిత్ర లబ్ధిదారులకు నాలుగో విడత ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు జగన్. వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అయితే గతంలో ఎప్పుడూ లేనట్టు ఇప్పుడు వైజాగ్ లో పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతోంది. మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చినా అధికారికంగా వారివైపు నుంచి సమ్మె విరమణ ప్రకటన రాలేదు, మరోవైపు స్కూళ్ల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు, ఇంకోవైపు స్టీల్ ప్లాంట్ సమస్య ఉండనే ఉంది. ఇవన్నీ కాదన్నట్టు జనసేన ఈరోజు నుంచి రోడ్ల సమస్యలపై డిజిటల్ క్యాంపెయిన్ పెడుతోంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని వైజాగ్ సీఎం సీఎం టూర్ కోసం పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ ఓనర్లకు వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏడా ఆర్థిక సాయం అందిస్తోంది. వాహన మిత్ర పేరుతో ఈ సాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తుంది. వాహనాల మరమ్మత్తులు, ఇన్స్యూరెన్స్, తదితర అవసరాలకోసం వీటిని వినియోగించుకోడానికి ప్రతి ఏడాదీ 10వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇప్పుడు నాలుగో విడత ప్రభుత్వం ఈ సాయం అందిస్తోంది. దీనికోసం విశాఖ పట్నాన్ని వేదికగా ఎంచుకున్నారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.61 లక్షలమంది లబ్ధిదారులకు 261 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చబోతున్నారు.
వైజాగ్ బహిరంగ సభకోసం భారీగా జన సమీకరణ కూడా జరుగుతోంది. నాయకులు, కార్యకర్తలు కాకుండా లబ్ధిదారులు కనీసం 30వేలమంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ సక్సెస్ ని దృష్టిలో ఉంచుకుని, జగన్ కి భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు స్థానిక కేడర్ కూడా సిద్ధంగా ఉంది. నగరంలో జగన్ రెండు గంటలసేపు ఉంటారని తెలుస్తోంది. వాహన మిత్ర సభ విజయవంతం చేసి మరోసారి ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టించాలని చూస్తోంది వైసీపీ. ప్లాన్ బాగానే ఉంది కానీ, స్థానికంగా సీఎంకు నిరసన సెగ తగిలే అవకాశముందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే నిరసనకారులు, ఆందోళనకారులందర్నీ ఎక్కడికక్కడ నిర్బంధించే ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని రోడ్లపైకి రానీయకుండా అడ్డుకునే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: