రాయలసీమ : ప్రభుత్వాన్నే థిక్కరించిన సొంత ఎంపీ

Vijaya



జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సొంతపార్టీ ఎంపీయే థిక్కరించారు. కృష్ణాయాజమాన్య బోర్డు ను కర్నూలులో ఏర్పాటు చేయాలని హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లేఖరాయటం సంచలనంగా మారింది. ఆంధ్ర-తెలంగాణా మధ్య నదీజలాల వివాదల పరిష్కారానికి కేంద్రం గోదావరి, కృష్ణా నదీ యాజమాన్యాల బోర్టులను ఏర్పాటుచేసింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు  హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో ఈ బోర్డు ఉండటంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేవు.



ఇక కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటును హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం లేఖ రాసింది. అయితే అప్పట్లో ఆ లేఖకు కేంద్రం పెద్దగా సానుకూలంగా స్పందించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణాబోర్డును విశాఖపట్నంలో పెట్టాలని మరో లేఖ రాసింది. ఎలాగూ వైజాగ్ క్యాపిటల్ అయిపోతుంది కాబట్టి రాజధానిలో ఉంటే బాగుంటుందని జగన్ భావించినట్లున్నారు. అందుకనే విశాఖలో బోర్డు ఏర్పాటుకు లేఖరాశారు.




నిజానికి చంద్రబాబు రాసిన లేఖ తప్పే, తర్వాత జగన్ రాసిన లేఖ కూడా తప్పే. ఎలాగంటే కృష్ణానది మన రాష్ట్రంలోకి ప్రవేశించేది కర్నూలు జిల్లా నుండే. అందుకనే కృష్ణానదీ యాజమాన్య బోర్డు కర్నూలులో ఉండాలని రాయలసీమ జలాల ఉద్యమకారులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి డిమాండును చంద్రబాబు, జగన్ ఇద్దరు పట్టించుకోలేదు.




తాజాగా జగన్ రాసిన లేఖ ప్రకారం కృష్ణాబోర్డును వైజాగ్ లో ఏర్పాటుచేయటానికి జలశక్తి స్టాండింగ్ కమిటి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ విషయం తెలియగానే హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించి కృష్ణాబోర్డును కర్నూలు పెట్టాలని కమిటికి లేఖ రాశారు. నిజానికి ఈ లేఖ రాయాల్సింది కర్నూలు, నంద్యాల ఎంపీలు. ఎందుకంటే కృష్ణాబోర్డును తమ జిల్లాలో ఏర్పాటు చేయించుకోవాలనే ఇంట్రస్టు చూపాల్సింది కర్నూలు, నంద్యాల ఎంపీలే. కానీ రాసింది అనంతపురం జిల్లాలోని హిందుపురం ఎంపీ మాధవ్. ఎవరు రాస్తే ఏమిటి ఎంపీ నుండైతే లేఖ వెళ్ళింది కదాని ఉద్యమకారులు హ్యాపీగా ఉన్నారు. మరి ఎంపీ రాసిన లేఖను కమిటి పరిగణలోకి తీసుకుంటుందా ? ఎంపీ రాసిన లేఖ విషయం జగన్ కు తెలుసా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: