పాక్‌: ఉత్కంఠ నడుమ కుప్పకూలిన ఇమ్రాన్‌ సర్కార్‌?

Chakravarthi Kalyan
పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. పార్లమెంట్‌లోఅవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇమ్రాన్ ఖాన్ పదవి  నుంచి తొలగించబడ్డాడు. దీంతో పాకిస్తాన్‌లో నెలరోజులుగా సాగుతున్న రాజకీయ రణరంగం ముగిసింది. రాజకీయ క్రీడకు తెరపడింది. సాధారణ మెజారిటీ సాధించలేక ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అంతా ఊహించినట్టు ఇమ్రాన్ ఖాన్‌ మెజారిటీ సాధించలేకపోయారు. ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వానికి మెజారిటీ లేదన్న సంగతి తెలిసినా.. చివరి బంతి వరకూ ఆటాడతానన్న ఇమ్రాన్ ఖాన్‌ వ్యాఖ్యలతో ఉత్కంఠ నెలకొంది.

పార్లమెంట్ స్పీకర్ ఇమ్రాన్ ఖాన్‌ పట్ల పక్షపాతం చూపించడం.. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించకపోవడం.. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవిస్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం.. వంటి పరిణామాలతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ రెండు రోజులుగా ఉంది. చివరి వరకూ అవిశ్వాస తీర్మానం విషయంలో జాప్యం చేసిన ఇమ్రాన్ ఖాన్‌ టీమ్.. చివరకు ఓటమి తప్పలేదు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఇమ్రాన్‌ ప్రత్యర్థి వర్గానిదే పైచేయి అయ్యింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 174 మంది సభ్యులు ఓటేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇమ్రాన్ ఖాన్‌ పదవి కోల్పోయారు.

ఓటింగ్‌ సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ వర్గం పార్లమెంట్‌లోనే లేదు. అవిశ్వాసం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్‌ ను ప్రధాని పదవి నుంచి పాక్‌ పార్లమెంట్‌ తప్పించింది. ఇలా అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన తొలి ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్ పాక్ చరిత్రలో నిలిచిపోయారు.  పదవి పోవడంతో ఇమ్రాన్ ఖాన్‌ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యే అవకాశం ఉంది.

ఇమ్రాన్‌ఖాన్‌ పదవీచ్యుతుడైనా.. అతనిపై తాము కక్షసాధింపు చేయబోమని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. మరోవైపు అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్‌లో నెగ్గడం పట్ల విపక్ష నేత బిలావల్‌ భుట్టో హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు శుభాభినందనలు.. ఇక పూర్వ పాకిస్తాన్‌ రాబోతోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: