ఇండియా గురించి ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పిన నిజం?

Chakravarthi Kalyan
పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఇండియా గురించి ఓ మంచి నిజం చెప్పారు.. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న తేడా గురించి చక్కగా వివరించారు. ఇండియా పాస్‌పోర్ట్ ను చూస్తే గౌరవంగా చూస్తారని.. అదే పాకిస్తాన్ పాస్‌ పోర్టును చూస్తే అనుమానంగా చూస్తారని ఇమ్రాన్ ఖాన్‌
వ్యాఖ్యానించడం విశేషం.. పాపం.. పదవి పోతున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్‌కు జ్ఞానోదయం అవుతున్నట్టు అనిపిస్తోంది.

ఈ విషయం ఇన్నాళ్లూ ఆయన గమనించలేదా.. గమనించే ఉంటారు.. కానీ చెప్పాలనే సాహసం చేసి ఉండరు. ఇప్పుడు ఎలాగూ పదవి పోతుంది కదా అన్న ఆవేదనతో ఇలాంటి నిజాలన్నీ చెప్పి ఉంటారు. ఇదే కాదు.. ఇటీవల కాలంలో ఇమ్రాన్ ఖాన్‌ ఇలాంటి నిజాలు చాలా చెబుతున్నారు. మొన్నటికి మొన్న భారత విదేశాంగ విధానం గురించి కూడా ఇమ్రాన్ ఖాన్‌ చాలా చక్కగా చెప్పారు. భారత విదేశాంగ విధానం ఎప్పుడు ఆ దేశ ప్రయోజనాల కోసమే ఉంటుందని మెచ్చుకున్నారు.

పాక్ విదేశాంగ శాఖ అధికారులు ఇండియా అధికారులను చూసి నేర్చుకోవాలని ఇమ్రాన్ ఖాన్‌ కామెంట్ చేశారు. అదే సమయంలో పాక్ నాయకులు కూడా ఇండియా నాయకులను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు.. ఇండియా ను చూసి పాక్ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పొరుగు దేశం నాశనం కావాలని కోరుకోవడం.. పొరుగు దేశంపై ఉగ్రవాదులను సరిహద్దుల గూండా చొప్పించడం వంటి దుశ్చర్యలు కాకుండా దేశాన్ని ఎలా బాగు చేసుకోవాలో ఆలోచిస్తే పాక్‌ భవితవ్యం బావుంటుంది.

అలాగని ఇండియా మరీ అంత సుద్ద పూస అని చెప్పడం లేదు. కానీ.. పాక్ తో పోలిస్తే ఇండియా ఎన్నో విషయాల్లో ఎన్నో రెట్లు మంచి స్థానంలో ఉంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ ఏడుపు కూడా అదే కదా. అమెరికా కూడా పాకిస్తాన్‌నే తప్పుబడుతుంది... ఇండియాను మాత్రం ఏమీ అనదు అని కూడా ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ బాధపడిపోయారు. ఏదేమైనా పాక్ నేతలకు ఇండియా అన్నా.. ఇండియా మంచితనం కాస్తయినా అర్థమవుతున్నందుకు సంతోషించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: