ఆరు నెలల క్రితం ఆర్థికమంత్రి.. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్?
ఆయన ఒక్క సంతకం పెడితే.. వందల కోట్ల డాలర్లు పరుగులు పెట్టేవి..కానీ ఇప్పుడు అదే ఆర్థిక మంత్రిగా పని చేసిన వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడం కోసం దేశం కాని దేశంలో క్యాబ్ నడుపుకుంటున్నాడు. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదా.. కొన్ని జీవితాల్లో నాటకీయత సినిమాలను మించి ఉంటుందనడానికి ఈ కథే ఒక ఉదాహరణ.. ఇంతకీ ఆయన ఎవరో చెప్పలేదు కదా.. ఆయనే ఖలీద్ పయెండా.. ఆరు నెలల క్రితం ఆయన ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక మంత్రి. వేల కోట్ల రూపాయల విలువైన ఆఫ్ఘన్ బడ్జెట్‌ను రూపొందించిన అమలు చేసిన వ్యక్తి.
అలాంటి ఖలీద్ పయెండా ఇప్పుడు అమెరికాకు వలస వెళ్లిపోయి.. అక్కడ కుటుంబాన్ని పోషించుకునేందుకు క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇందుకు కారణం తాలిబన్లు ఆఘ్ఘన్ ప్రభుత్వాన్ని పడకొట్టి ఆటవిక రాజ్యానికి అంకురార్పణ చేయడమే. ఇపుడు ఖలీద్ రోజూ ఆరు గంటల పాటు క్యాబ్ నడిపితే.. 150 డాలర్లు సంపాదించడం గగనం అవుతోంది. కానీ ఏం చేస్తాడు.. పెళ్లాం, పిల్లలను పస్తు పడుకోబెట్టలేడు కదా.
ఈ ఖలీద్ తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడం ఖాయం అని తెలియగానే తన పదవికి రాజీనామా చేసేసి ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్లిపోయాడు. వాషింగ్టన్ లో క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదొక్కటే కాదు.. ఖలీద్.. జార్జ్‌టౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారెన్ సర్వీసెస్ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నాడట. తాలిబన్ల ఆక్రమణతో తన జీవితం ఛిన్నాభిన్నం అయిందంటున్నాడు ఖలీద్.