మళ్లీ కరోనా పంజా.. చైనాలో లాక్‌డౌన్‌?

Chakravarthi Kalyan
కరోనా.. ఇప్పుడు ఇండియాలో కరోనా అన్న భయం పూర్తిగా తొలగిపోయింది. కేసులు ఏదో నామమాత్రంగా వస్తున్నాయి. జనం మాస్కులు పెట్టుకోవడం కూడా మానేశారు. కానీ.. ఈ కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ పరిస్థితి మారుతోంది. క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ప్రపంచాన్ని కరోనా కబళిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే.. చైనాలో ఏకంగా ఓ నగరంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు.

లాక్‌డౌన్‌.. ఇండియాలో ఈ పదాన్ని మరిచిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చైనాలో లాక్‌డౌన్‌ పెట్టారు. చైనాలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌లోకి 90లక్షల మంది ప్రజలను ఉంచాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలో నిన్న ఒక్కరోజే 1300లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా రోజువారీ కేసులు వెయ్యికి పైనే ఉండటం ఈ మధ్య చాలా తక్కువ. గత రెండేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్ అని చెబుతున్నారు.

అక్కడ మూడు వారాల క్రితం వరకు కరోనా కేసులు రోజుకు 100లోపే ఉండేవట. కానీ ఇప్పుడు  కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 1369 కొత్త కేసులు బయటపడినట్టు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. చైనాలోని పదికి పైగా ప్రావిన్సుల్లో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోందట. ఇక చైనాలోని చాంగ్‌చున్‌లో నగరంలో ఈ  వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందుకే ఎందుకైనా మంచిదని అక్కడ లాక్‌ డౌన్ పెట్టేశారు.

90లక్షల జనాభా కలిగిన ఈ చాంగ్‌ చున్‌ నగరంలో దుకాణాలు అన్నీ మూసేశారు. ప్రజల రవాణాను ఆపేశారు. చాంగ్ చున్ వాసులంతా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని చైనా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు.. ఆ నగరంలో సామూహికంగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. చాంగు చున్‌ తో పాటు షాంఘై వంటి ఇతర నగరాల్లోనూ లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను అమలు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: