థాంక్‌ గాడ్‌: ఉక్రెయన్‌, రష్యా చర్చల్లో పురోగతి!

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. మారణ కాండ కొనసాగుతూనే ఉంది. ఒక్కో నగరంపై రష్యా పంజా విసురుతోంది. ఇప్పటికే కీవ్, ఖర్కీవ్ నగరాలను ఇప్పటికే రష్యా ముట్టడి చేయగా.. ఇప్పుడు ఖేర్సన్ అనే పట్టణంపైనా రష్యా దాడి ముమ్మరం చేసింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇలా నలుదిక్కులా రణనినాదాలు వినిపిస్తున్న సమయంలో ఇప్పుడు కాస్త ఆశాకిరణం కనిపిస్తోంది. శాంతి రేఖలు ప్రసరిస్తున్నాయి.

ఉక్రెయన్‌- రష్యా మధ్య తాజాగా జరిగిన రెండో విడత చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. పోలాండ్ సరిహద్దుల సమీపంలోని బెలారస్ లో ఈ రెండు దేశాల ప్రతినిధులు శాంతి చర్చలు నిర్వహించారు. గతంలో జరిపిన శాంతి చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోగా.. ఇప్పుడు కాస్త పురోగతి కనిపిస్తోంది. రష్యా దిగ్బంధించిన నగరాల్లో పౌరుల రక్షణ కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా అంగీకారం తెలపడం కాస్త ఊరట ఇస్తోంది.

ఈ నగరాల నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సురక్షితమైన కారిడార్లను ఏర్పాటుకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి. ఈ కారిడార్లలో కాల్పుల విరమణ పాటించేందుకు రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు అంగీకరించాయి. అంతే కాదు.. ఈ కారిడార్ల ద్వారా మానవత సాయం సరఫరాకు కూడా ఈ రెండు దేశాలు అంగీకరించాయి. ఈ నిర్ణయం ద్వారా చాలా వరకూ ప్రాణ నష్టం నివారించే అవకాశం ఉంది. యుద్ధం రెండు దేశాల మధ్యే తప్ప.. రెండు దేశాల పౌరుల మధ్య కాదన్న స్పృహ ఈ నిర్ణయం ద్వారా వెల్లడయింది.

అయితే ఈ  ఒప్పందాలకు ఇరుదేశాల పార్లమెంటులు ఆమోదం తెలిపాల్సి ఉందని రష్యా వెల్లడించింది. ఈ ఒక్క నిర్ణయం తప్ప మిగిలిన అంశాల్లో రెండు దేశాల మధ్య పెద్దగా సయోధ్య లభించలేదు. దీంతో రెండో విడత చర్చలపై ఉక్రెయిన్ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. మూడో విడత చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించిన సమయంలో మూడో విడత చర్చల్లో కొన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక విధంగా చర్చల ప్రక్రియ ముందుకు సాగితే.. అప్పుడే శాంతికి అవకాశం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: