యూపీ: బీజేపీకి మళ్లీ షాక్‌.. 13 మంది ఎమ్మెల్యేలు జంప్..?

Chakravarthi Kalyan
మరికొన్నిరోజుల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. యోగి నాయకత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. నిన్న ఏకంగా యూపీ  కార్మికశాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి, బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. అంతే కాదు.. ఆయనతో పాటు మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇదే పెద్ద షాక్ అనుకుంటే.. ఇప్పుడు ఇంకో షాక్‌ బీజేపీ కోసం రెడీగా ఉందట.

అదేంటంటే.. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమాజ్‌ వాదీ పార్టీలో చేరబోతున్నారట. ఈ మేరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. యూపీ రాజకీయాల్లో మరో బాంబు పేల్చేశారు. యూపీలో ఎన్సీపీ.. సమాజ్‌ వాదీ పార్టీ, ఇతర చిన్నపార్టీలతో కలిసి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేయబోతోందట. యూపీ జనం మార్పు కోరుకుంటున్నారని... తప్పకుండా యూపీలో మార్పును చూస్తామని శరద్‌పవార్‌ అంటున్నారు.

ఇక ఎప్పటిలాగే పార్టీ వీడిన నాయకులు.. యోగి సర్కారు తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దళితులు, రైతులు, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలను, నిరుద్యోగ యువతను పట్టించుకోవట్లేదని కార్మికశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య అంటున్నారు. అందుకే తాను రాజీనామా చేశానన్నారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

ఇలా వరుస దెబ్బలతో యోగి టీమ్‌ ను నిస్పృహకు లోను చేస్తున్నాయి. హిందూత్వనే నమ్ముకున్న యోగి.. రామాలయం, వారణాశి అంశాలను బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే యోగి సర్కారు పట్ల వ్యతిరేత పెరిగిందని.. ఈసారి ప్రభుత్వ మార్పు ఖాయమని ఎస్సీ ఆశావాదంతో ఉంది. సరిగ్గా ఎన్నికలకు ముందు జరుగుతున్నఈ కప్పదాట్లు మరి ఎస్పీకి కలసి వస్తాయా.. ఇది ప్రభుత్వ మార్పునకు సూచిక అవుతుందా.. కాదా అన్నది ఓట్లు పోలయ్యాక కానీ తెలియదు. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఏడు విడతలుగా జరుగుతాయి. ఫిబ్రవరి 7న తొలి విడత పోలింగ్ ఉంది. మార్చి7న చివరి విడత. మార్చి 10న యూపీ ఫలితాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: