రేవంత్ రెడ్డీ.. ఇదేంపని..? మాణిక్యం మందలింపు..?

Chakravarthi Kalyan
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి కాస్త మందలింపు వచ్చింది. హైదరాబాద్‌లో  జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డిని పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ మందలించారు. ఒంటెత్తు పోకలు వద్దని.. అందరినీ కలుపుకుపోవాలని మందలించారు.
జూమ్ యాప్‌లో దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం ఆద్యంతం హాట్ హాట్‌ గా సాగింది. వాడీవేడిగా సాగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో రేవంత్‌ రెడ్డి వైఖరి పట్ల సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవల రేవంత్‌ రెడ్డి తీరుపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జగ్గారెడ్డి ఈ విషయంలో బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చివరకు ఆయన సోనియా గాంధీకి కూడా ఫిర్యాదు లేఖ రాశారు. రేవంత్ రెడ్డిని తొలగించమని అడిగారు కూడా. ఆ లేఖ మీడియాకు ఎక్కడంతో రచ్చరచ్చ అయ్యింది. ఈ వ్యవహారాలన్నీ చర్చకు వచ్చాయి. పార్టీ వ్యవహారాలను ఎవరు బహిర్గతం చేసినా సహించేది లేదన్న మాణిక్యం ఠాగూర్‌.. ఇలాంటివి ఇక ముందు సహించేది లేదన్నారు.

అలాగే ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై జరిగిన ప్రచారం గురించి కూడా చర్చకు వచ్చింది. తనను కోవర్టుగా చిత్రీకరించారని.. ఇకపై తాను పార్టీలో ఉండదలచుకోలేదని తెలిపిన జగ్గారెడ్డి కొద్దిసేపు అలకబూనారు. దీంతో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని శ్రీధర్‌బాబు, జానారెడ్డి వంటి వారు సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. అదే సమయంలో క్రమశిక్షణ కమిటీ తీరుపై పొన్నాల, గీతారెడ్డి, వీహెచ్‌ వంటి వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక ముందు జూమ్‌ భేటీలకు తాను హాజరుకాబోనని వీహెచ్చ్ స్పష్టం చేశారు. అంతే కాదు.. క్రమమశిక్షణ కమిటీ నిర్ణయాలు మీడియా ముందు ప్రదర్శించవద్దని అనేక మంది సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వాల గురించి కూడా చర్చకు వచ్చింది. సభ్యత్వ నమోదు సరిగా జరగట్లేదని ఆందోళన వ్యక్తం చేసిన మాణికం ఠాగూర్‌.. సభ్యత్వ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఈ మీటింగ్‌కు కోమటిరెడ్డి సోదరులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గైర్హాజరు కావడం కూడా చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: