సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

NAGARJUNA NAKKA
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వారానికో.. నెలకో ఒకసారి వెళ్లే సినిమా టికెట్ రేట్లు తగ్గించడం కాదనీ.. ప్రతీరోజు అవసరమయ్యే నిత్యావసర సరుకుల రేట్లు తగ్గించాలన్నారు. సినిమా కార్మికుల మీద కూడా జగన్ సైకో ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. విలాసాలు, అవసరాలకు మధ్య తేడాను దయచేసి అర్థం చేసుకోండి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే ప్రజలకు మంచిదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైరికల్ రిప్లై ఇచ్చారు. సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనీ.. అందుకే ధరలు తగ్గించినట్టు చెప్పారు మంత్రి  బొత్స సత్యనారాయణ. మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండనక్కర్లేదా అని వైఎస్ జగన్ గారూ అని ప్రశ్నించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అవి కూడా తగ్గించండి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రభుత్వానికి సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేశ్ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఎలా ఉన్నాయో చూడాలని సూచించారు. ఆయన ఏపీ పోలీసు వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి పోలీసుల తీరును కేంద్రం టెలిస్కోపుతో చూస్తోందని.. త్వరలోనే ప్రక్షాళన తప్పదని హెచ్చరించారు. పోలీసు ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం నడుచుకోలేదని ఆయన ఆరోపించారు.
మరోవైపు సినిమా టికెట్ల ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫార్సులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏసీ థియేటర్లలో కనీస ధర 50రూపాయలు, గరిష్ట ధర 150రూపాయలు, మల్టీ ప్లెక్స్ లలో కనిష్ట ధర 100రూపాయలు, గరిష్ఠ టికెట్ ధర 250రూపాయలు, రిక్లైనర్ సీట్లకు 300రూపాయలతో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేసేందుకు అనుమతించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: