ఎన్టీఆర్ బాటలో చంద్రబాబు... అవమానంపై పోరాటం..!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాయి. దాదాపు ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ధర్నాతో దిగి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గిన మోదీ సర్కార్... చివరికి వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో ఉదయం నుంచి మీడియా అంతా మోదీ ప్రకటన పైనే ఫోకస్ పెట్టింది. కానీ ఇదంతా మధ్యాహ్నం వరకే. ఏపీ అసెంబ్లీ, చంద్రబాబు ప్రెస్ మీట్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు అంతా చంద్రబాబు చేసిన ప్రతిజ్ఞ... ఆ తర్వాత పరిణామాలపైనే చర్చించుకుంటున్నారు. మళ్లీ గెలిచిన తర్వాతే సభలో కాలుపెడతా అంటూ చంద్రబాబు శపధం చేశారు. ఇప్పుడు తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామంటూ ఇప్పటికే ఆ పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు కూడా. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు చంద్రబాబు.
అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి ప్రజలంతా అండగా ఉండాలంటూ ఇప్పటికే చంద్రబాబు  పిలుపు ఇచ్చారు కూడా. తన నిజాయితీ ఏమిటో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. అంటే... ప్రజల్లోకి వెళ్లడం ఖాయమనే మాట చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు. అయితే అది ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. గతంలో వరుసగా రెండు సార్లు ఓడిన తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కూడా చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు కూడా. అది 2012లో దాదాపు 2 వేల 500 కిలోమీటర్ల దూరం నడిచారు. పదేళ్ల క్రితం కావడం... అప్పట్లో చంద్రబాబు వయసు 60 పదుల్లో మాత్రమే ఉండేది. దీంతో పెద్ద సమస్యలు ఏమి రాలేదు. కానీ ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్ల వయసు దాటేసింది. ఈ వయసులో పాదయాత్రలు చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది పార్టీ ముఖ్యనేతల సూచన. కుదిరితే పాదయాత్ర.. లేదంటే బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: