పీఆర్సీపై పీటముడి.. జగన్ ని టార్గెట్ చేసిన ఉద్యోగులు..

Deekshitha Reddy
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడంతో, జేఎస్‌సీ సమావేశాన్ని13 సంఘాలలో 9 సంఘాలు బహిష్కరించాయి. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. లేదంటే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల వాదన ఇలా ఉంటే, కరోనా కారణంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, కాస్త సమయం కావాలని అంటున్నారు వైసీపీ నేతలు, ఉన్నతాధికారులు.
అయితే వీరిలో ఎవరి వాదన నెగ్గుతుంది. అసలేం జరుగుతోంది..? ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఉన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఎస్‌సీ సమావేశంలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ.. అందరికీ నెరవేరుస్తున్నారని.. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులను ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి వచ్చే సరికి సర్దుకు పొమ్మంటున్నారని నేరుగానే ప్రశ్నించారట.. ఈ మాటలకు సమాధానం చెప్పలేక సీఎం తుది నిర్ణయం తీసుకోవాలని చేతులెత్తేశారట ఉన్నతాధికారులు.
ఈ వ్యాఖ్యలతో అసంతృప్తికి లోనైన ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయం ఎదుట ఆందోళన చేశారు. తమకు రావల్సిన పీఎఫ్‌ బకాయిలు రూ.1000 కోట్లు, ఉద్యోగులు వైద్యం కోసం ఇచ్చిన బిల్లులు రూ.21 కోట్లు, రిటైర్డు ఉద్యోగుల లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ రూ.40 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ అడిగితే సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈనెల ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే గొప్పని చెబుతున్నారంటూ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై ఇలా రచ్చ చేస్తూ, ఆందోళనబాట పట్టిన ఉద్యోగుల సమస్య పరిష్కారమవుతుందా.. లేక వివాదం ముదురుతుందా..? అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: