మాంఛి ఛాన్సు మిస్.. గింజుకుంటున్న టీడీపీ నేతలు..?

Chakravarthi Kalyan
టీడీపీ నేతలు ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారు. మాంచి అవకాశం అందినట్టే అందివచ్చి చేజారిపోయిందే అని మథనపడుతున్నారు. దేని గురించి అంటారా.. ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్‌ స్కామ్‌ గురించి. దీన్ని ఏపీకి అంటగట్టి జగన్ సర్కారును ఏకేయాలని టీడీపీ నేతలు చాలా ప్రయత్నించారు. పట్టాభి, నరేంద్ర వంటి నాయకులు.. చివరకు చంద్రబాబు, లోకేశ్ కూడా ఈ అంశంపై కొన్నిరోజులుగా ఫోకస్ చేశారు. చంద్రబాబు అయితే ఏకంగా అఫ్ఘనిస్తాన్‌ నుంచి  నేరుగా తాడేపల్లికే డ్రగ్స్ వస్తున్నాయన్నారు.

అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదని కేంద్రం తేల్చడంతో ఈ నేతలంతా డీలా పడిపోయారు. ఇటీవల గుజరాత్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ నిల్వలతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వర్గాలు క్లారిటీ ఇచ్చేశాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి ఇరాక్‌ మీదుగా గుజరాత్‌కు దిగుమతైన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయేనని తేల్చి చెప్పింది డీఆర్ఐ. నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్లు డీఆర్‌ఐ తేల్చింది.

అంతే కాదు.. ఈ డ్రగ్స్‌ అక్రమ తరలింపు కేసులో దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థకు ఇచ్చింది. హెరాయిన్‌ దిగుమతితో ఏపీకి సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన నివేదికలో స్పష్టంగా చెప్పడం టీడీపీ నాయకులను నిరాశ పరుస్తోంది. అంతే కాదు.. గుజరాత్‌లో హెరాయిన్‌ జప్తు కేసులో అరెస్టైన నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. విజయవాడకు చెందిన సంస్థ హెరాయిన్‌ను దిగుమతి చేసుకుంటే పశ్చిమ తీరాన గుజరాత్‌లో ఉన్న ముంద్రా పోర్టుకు ఎందుకు తెస్తారని న్యాయమూర్తి ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

విజయవాడకు సమీపంలో తూర్పు తీరంలోనే పలు పోర్టులు ఉన్నాయి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. హెరాయిన్‌ను ఢిల్లీకి తరలించాలన్నదే స్మగ్లర్ల ఉద్దేశమని డీఆర్‌ఐ కూడా న్యాయస్థానానికి చెప్పేసింది. విజయవాడకు చేర్చడం అసలు స్మగ్లర్ల లక్ష్యమే కాదని కోర్టుకు చెప్పింది. ఈ వరుస పరిణామాలతో టీడీపీ నేతలకు ఆశాభంగమైంది. ఇక ఈ ఇష్యూని ఇంతటితో వదిలేస్తారా..లేక ఇంకా సాగదీస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: