ఇందూరు టీఆర్ఎస్‌లో కానరాని జోరు!

N.Hari
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అధికార పక్షమైన టీఆర్ఎస్‌లో జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఆసక్తి ఉన్న వారికి అవకాశం రావడం లేదు. వాస్తవానికి జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి చూపే అభ్యర్థుల పేర్లను అధిష్ఠానానికి పంపాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. చాలా జిల్లాల నుంచి ఈ పాటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్న ప్రాంతాల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఏకాభిప్రాయంతో అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు. లేదా జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా కలిసి ఒకరి పేరునే ప్రతిపాదిస్తే అతన్ని ఖరారు చేస్తారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపాలని అధిష్ఠానం సూచించినప్పటికీ, ఇంతవరకు ఏ ఒక్కరినీ ఎంపిక చేయలేదు.
ఇప్పటివరకు టీఆర్ఎస్‌ సీనియర్ నాయకుడు ఈగ గంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఏడేళ్లుగా ఆయన పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. ఇక తనకు ఈ బరువు బాధ్యతలు చాలని, ఈ పోస్టును మరొకరికి ఇవ్వాలని గంగారెడ్డి కోరుతున్నారు. ఇన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకు ఎమ్మెల్సీ పోస్టు ఇప్పించాలని పార్టీ పెద్దల చెవిన వేశారు. ఇప్పట్లో ఇతర పోస్టులు ఇచ్చే, వచ్చే అవకాశం లేకపోవడంతో తనకు ప్రమోషన్ లేకుండా పోతోందని ఆయన ఆవేదన చెందుతున్నారు. మళ్లీ బలవంతంగా ఇదే పోస్టులో కూర్చోబెడితే తన రాజకీయ భవిష్యత్తు ఇంతటితో ఆగిపోతుందని మదన పడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తనను ఈ పోస్టు నుంచి రిలీవ్ చేసి మరొకరికి అవకాశం ఇవ్వాలని గంగారెడ్డి భావిస్తున్నారు.
అయితే, నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి కనీసం ఒక్కో పేరు ప్రతిపాదించాలని అధిష్ఠానం సూచించింది. లేనిపక్షంలో అందరూ కలిసి ఒక పేరు సూచించాలని భావించింది. ఈ బాధ్యతలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్ గా ఎమ్మెల్సీ కవిత ఖరారు చేసే వారికే జిల్లా అధ్యక్షుడి పదవి దక్కుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
గతంలో కూడా కవిత ఎంపిక చేసిన వారికే పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యేలు రిస్క్ తీసుకోవడం లేదని అంటున్నారు. ఒకవేళ తమ సన్నిహితులకు ఈ పోస్టు ఇప్పించాలని అనుకున్నా, చివరికి ఎమ్మెల్సీ కవిత ఆమోదం లేకుంటే మాత్రం ప్రయత్నం విఫలమవుతందని వారనుకుంటున్నారు. ఇలాంటి కారణాల వల్లే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎవరినీ రికమండ్ చేయడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: