పవన్ దూకుడుతో టీడీపీ వెనక్కి తగ్గిందా..?

Deekshitha Reddy
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు వెనక ఎవరున్నారు..? వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే చంద్రబాబుతో పవన్ లాలూచీ పడ్డారా..? అందుకే బద్వేల్ ఉపఎన్నికల విషయంలో వెనక్కి తగ్గారా..? ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. చంద్రబాబు ప్రోద్బలంతోనే పవన్ వైసీపీపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వీరి విమర్శల విషయం పక్కన పెడితే పవన్ కల్యాణ్ సీన్ లోకి రాగానే టీడీపీ మాత్రం నెమ్మదించింది. వాస్తవానికి పవన్ సీన్ లోకి రాకముందు నుంచే టీడీపీ యాక్టివిటీ బాగా తగ్గింది. ఆమధ్య నారా లోకేష్ పరామర్శ యాత్రలు, అరెస్ట్ ల తర్వాత టీడీపీ సీనియర్లెవరూ జనాల్లోకి రాలేదు.
బద్వేల్ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం జగన్ కడప టూర్లోనే ఉన్నారు. సీఎం వెళ్ళాక టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఎన్నికల కోసం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని కూడా టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరో మూడురోజుల్లోనే బద్వేలు టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి నామినేషన్ తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్ అనంతరం చంద్రబాబుతో పాటూ.. లోకేష్ కూడా వరుసగా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ.. చంద్రబాబు బద్వేల్ ఎన్నికల విషయంలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. నిన్నటివరకూ పవన్ పోటీలో ఉంటారు కనుక, చంద్రబాబు స్లో అయ్యాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. అయితే తాజాగా పవన్ తప్పుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబుపైకి మళ్లింది. సీఎం జగన్ సొంత జిల్లాలో ఉపఎన్నికలు కావడంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే బద్వేల్ ప్రచార భాద్యతలు అప్పగించేశారు. ఇక ఈ ఎన్నికల విషయంలో చంద్రబాబు చక్రం తిప్పుతారా.. లేదా.. అనేది వేచి చూడాలి.
బద్వేల్ ఉప ఎన్నికల విషయం పక్కనపెడితే ఇటీవల టీడీపీ యాక్టివిటీ బాగా తగ్గింది. నాయకులెవరూ జనాల్లోకి రాలేదు. ఆమధ్య నిరసన వారం అంటూ హడావిడి చేసారు, ఆ తర్వాత లోకేష్ పరామర్శల సందర్భంలో మాత్రమే నాయకులు రోడ్లపైకి వచ్చారు. ఆ తర్వాత జూమ్ కే పరిమితం అయ్యారు. కనీసం ఇప్పుడైనా బద్వేల్ ఉప పోరు పేరుతో టీడీపీ యాక్టివిటీ పెరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: