ఏపీని వీడని అప్పుల వివాదం!

N.Hari
ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల వివాదం నీడలా వెంటాడుతోంది.  తాజాగా ఏపీ సర్కారుకి కాగ్‌ కార్యాలయం నోటీసు పంపింది. దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు అప్పుల విషయంలో ఓ వైపు బుజ్జగిస్తూనే.. మరోవైపు గిల్లుతున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి దాకా ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను పంపాలని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది. అయితే ఇప్పుడు తాజాగా కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పుల వివరాలను తమకు పంపాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఏపీ ప్రభుత్వానికి శ్రీముఖం పంపింది. ఇందులో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన రుణాల వివరాలను, వాటికి చెల్లిస్తున్న వడ్డీ, తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ఆదాయ వనరులు ఏమిటనే అంశంపై తమకు వివరాలు అందించాలని ఆంధ్రప్రదేశ్‌ సర్కారుని ఆదేశించింది. ఈ లేఖ రావడంతో ఆర్ధిక శాఖ అధికారులు ఆందోళన చెందారు. వెంటనే రాష్ట్రంలోని కీలక నేతల వద్దకు తీసుకెళ్లి  ఈ వివరాలు అందిస్తే.. భవిష్యత్తులో అప్పులు పుట్టవని ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది. కేంద్రంలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం బుధవారం రాసిన ఈ లేఖ ఏపీ ప్రభుత్వానికి అదే రాజు రాత్రికే అందిందట. దీనిపై ప్రస్తుతం ఆర్ధిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలను సేకరించారు. గురువారం అధికారులు  ఈ అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి అకౌంటెంట్ జనరల్ కార్యాలయంతో మాట్లాడినప్పటికీ తాము అడిగిన వివరాలు పంపాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా పెద్దఎత్తున రుణాలు సేకరించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా 2014 నుంచి 2019 వరకు 21,122 కోట్ల రూపాయల అప్పును సేకరించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021 మార్చి 31వ తేదీ నాటికి 29 కార్పొరేషన్ల ద్వారా రూ. 1,19,230 కోట్లకు గ్యారంటీ ఇచ్చి.. రూ.1,05,866 కోట్లను రుణంగా సేకరించింది. ప్రస్తుతం ఈ అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. తాజాగా వచ్చిన లేఖతో ఇప్పుడు ఆర్ధిక శాఖ అధికారులు ఏం చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: