టీఆర్ఎస్‌ గేమ్‌ ప్లాన్‌ ఛేంజ్‌!?

N.Hari
హుజురాబాద్ ఉప ఎన్నికపై అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వ్యూహం మార్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. రాష్ట్ర ప్రజల ఫోకస్‌ను ఆ ఎన్నికల నుంచి షిఫ్ట్ చేసే ప్రయత్నాన్ని ఆ పార్టీ చేస్తుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉప ఎన్నిక ప్రాధాన్యతను తగ్గించేందుకు.. హుజురాబాద్ ఉపఎన్నిక తమకు చాలా చిన్నదని కేటీఆర్ పదేపదే చెప్పడంలో ఆంతర్యం అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిజానికి హుజురాబాద్‌ ఉపఎన్నికను అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకుని శ్రమిస్తున్నాయి. ఈటల రాజేందర్ సర్వం తానై పాదయాత్ర, సభలు, సమావేశాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈటల రాజేందర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలన్న పట్టుదలతో కేసీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్‌రావును రంగంలోకి దింపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఈటల రాజేందర్ సైతం గెలిచి తన సత్తా చాటాలనే పట్టుదలతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఈటల, హరీష్‌రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నా యి. ఒకరి మీద మరొకరు విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కానప్పటికీ పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. అయితే ఆ ఎన్నికపై ఉన్నట్లుండి గులాబీ పార్టీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. చర్చను నియోజకవర్గానికే పరిమితం చేయాలని భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రాధాన్యతను తగ్గించే ఎత్తుగడ అమలు చేస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికను కేటీఆర్ అతి చిన్నదిగా తీసి పడేసినా.. ఆ ఎన్నిక ప్రాధాన్యతపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అక్కడ వచ్చే ఫలితాన్ని బట్టే రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతమైన మార్పులు చోటుచేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే తిరుగులేని విధంగా మళ్లీ శక్తిని నిరూపించుకున్నట్లు అవుతుంది. కానీ ఈటల గెలిస్తే.. ఆ ఫలితంతో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా దూకుడు పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక ఉద్యమకారులంతా ఆయన వైపే ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. ఎన్నికల జిత్తులను ప్రజలు నమ్మలేదన్న ప్రచారం సైతం జరిగే ప్రమాదం ఉంది. అది గులాబీ పార్టీకి అత్యంత ఇబ్బందికరమైన విషయంగా మారుతుంది. దీంతో అక్కడ జయాపజయాలపై కేటీఆర్ వీలైనంత లోప్రొఫైల్‌ను హుజురాబాద్ విషయంలో మెయిన్‌టెయిన్ చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: