ఆంధ్రాలో ఒడిశా త‌గాదాలు

Hareesh
ఆంధ్రాలో ఒడిశా త‌గాదాలు, వివాదాలు  కొత్త కొత్త మ‌లుపులు తిరుగుతున్నాయి. ఇప్ప‌టికే జ‌ల‌వివాదాలు అప‌రిష్కృతంగా ఉన్నాయి. వీటికి తోడు స‌రిహ‌ద్దు వివాదాలు, భూ వివాదాలు రేపుతూ ఒడిశా త‌న‌దైన క‌ట్టడి మార్గం ఒక‌టి ఎన్నుకుంటుంది. దీంతో స‌రిహ‌ద్దు గ్రామాల‌లో ఆందోళ‌న‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. మావో ప్ర‌భావిత ప్రాంతాలుగా పేరున్న ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దు ఎప్ప‌టి నుంచో అభివృద్ధికి దూరం కాగా, ఉన్న కొద్ది పాటి విద్యావ‌న‌రులు కూడా త‌మవే అని పొరుగు రాష్ట్రం చేస్తున్న వాద‌న న్యాయ స్థానంలో నెగ్గుతుందో లేదో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం. ఇక్క‌డి అంగ‌న్ వాడీ కేంద్రాల‌పై హ‌క్కులు త‌మ‌వే అని ఒడిశా చెబుతూ, ఉన్న‌ప‌ళాన వీటిపై త‌మ అధికారం ఒక‌టి ప్ర‌క‌టించేందుకు స‌మాయ‌త్తం అవుతోంది. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇలాంటి వాద‌నే వినిపించి, గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణంకు కార‌ణ‌మైంది. దీనిపై ఏపీ అధికారులు మాత్రం సీరియ‌స్ గానే ఉన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే రెడ్డి శాంతి దృష్టికి ఈ స‌మ‌స్య‌ను అధికారులు తీసుకువెళ్లార‌ని  స‌మాచారం. క‌లెక్ట‌ర్ తో స‌హా ఇత‌ర యంత్రాంగం అప్ర‌మత్త‌మైంది. ఏఓబీలో త‌మ అధికారాల‌పై ఎప్ప‌టి నుంచో వివాదం ఉన్నా రాష్ట్రాల పెద్ద‌లు చ‌ర్చ‌ల‌కు తావివ్వ‌క స‌మ‌స్య‌ను పెద్ద‌ది చేస్తూ రాజకీయ ప్ర‌యోజ‌నం పొందేందుకు త‌హ‌త‌హలాడుతున్నార‌ని ఓ విమ‌ర్శ.
 
 
ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దు వివాదాలు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చాయి. స‌రిహ‌ద్దు త‌గాదాలు ఏమ‌యినా ఉంటే  తాము కోర్టుల్లో కాకుండా చ‌ర్చ‌ల ద్వారా తేల్చుకుంటామ‌ని ఇరు రాష్ట్రాల పెద్ద‌లూ న్యాయ‌స్థానంలో చెప్పిన‌ప్ప‌టికీ  తాజా వివాదం ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది.
ఇప్ప‌టికే ఒడిశాతో శ్రీ‌కాకుళం స‌రిహ‌ద్దు బంధంతో పాటు నీటి బంధాన్ని కూడా పంచుకుని ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఎగువ జ‌లాల‌ను వ‌దిలి వివాదాల‌కు కొన్ని సార్లు కార‌ణం అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. నేర‌డి బ్యారేజి వంశధార నీటిని స‌ద్వినియోగం చేసుకునే లా చేసుకునేందుకు ఓ ప్ర‌య‌త్నం కూడా జ‌రిగింది. ఈ ద‌శ‌లో స‌రిహ‌ద్దు పంచుకుంటున్న పాత‌ప‌ట్నం, మంద‌సతో పాటు కొన్ని ప్రాంతాలు వివాదాలకు కేంద్రం అవుతున్నాయి. పాత‌ప‌ట్నం, మంద‌స‌, మెళియాపుట్టి, ఇచ్ఛాపురం, ప‌లాస‌తో స‌హా చాలా ఉద్దాన ప్రాంతాలు మ‌న సంస్కృతికి, ఒడిశా సంస్కృతికి వారధులుగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజా వివాదం సంచ‌ల‌నాత్మ‌కం అవుతోం ది.  మందస మండలం సాబకోట పంచాయితీ మణిక్యపురం గ్రామంలో ఒడిశా అధికారులు  హల్చల్ చేస్తున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్రా అధికారులు సైతం అప్ర‌మ‌త్తం అయ్యారు. ఇక్క‌డికి  అంగ‌న్ వాడీ కేంద్రం త‌మ ప‌రిధిలో ఉందంటూ ఓ కొత్త వాద‌న రేకెత్తిస్తూ త‌న‌దైన పంథాలో తాళాలు వేసుకుని వెళ్లిపోవ‌డ‌మే కాక సంబంధిత అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ను అరెస్టు చేసి ప‌ర్లాకిమిడి పోలీస్  స్టేష‌న్ కు త‌ర‌లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: