తాలిబన్లకు దిమ్మ తిరిగే షాక్..! కానీ అదే పైశాచికత్వం..!

NAGARJUNA NAKKA
ఆఫ్ఘాన్ లోని పంజ్ షేర్ ను ఆక్రమించుకునేందుకు వెళ్లిన తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పంజ్ షేర్ లోని వివిధ జిల్లాల్లో 600మంది తాలిబన్లను అక్కడి తిరుగుబాటు దళాలు హతమార్చాయి. మరో వెయ్యి మందికి పైగా తాలిబన్లను బందీలుగా చేసుకున్నాయి. ఇదే విషయాన్ని పంజ్ షేర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీమ్ దాష్ఠి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్కడ ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది.  
తాలిబన్ల ఆక్రమణలో ఉన్న ఆప్ఘానిస్థాన్ వెళ్లాలంటే విదేశాల్లో ఉన్న ఆప్ఘాన్ పైలట్లు సైతం భయపడిపోతున్నారు. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న పైలట్లను ఎక్కువ కాలం ఉంచడం కుదరదని ఉజ్బెకిస్థాన్ అధికారులు స్పష్టం చేయడంతో.. వారికి ప్రాణ భయం పట్టుకుంది. తమను వెనక్కి పంపితే తాలిబన్లు ఖచ్చితంగా చంపేస్తారని ఓ పైలట్ కన్నీరు పెట్టుకున్నాడు.  
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. ఓ వైపు షియా చట్టాన్ని గౌరవించాలని చెబుతూనే.. మరోవైపు మహిళలపై దాడులు చేస్తున్నారు. తాజాగా మహిళా సామాజిక కార్యకర్త నర్గీస్ దత్తాపై తాలిబన్లు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. కొంతమంది మహిళలతో కలిసి ఈమె మహిళా హక్కుల కోసం కాబూల్ లో నిరసన చేపట్టింది. ఇదిలా ఉండగా.. హెరాత్ ప్రావిన్స్ లో మహిళలు హక్కుల కోసం ర్యాలీసు చేస్తున్నారు.  
ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ దేశంలో పాగా వేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. తద్వారా మధ్య ఆసియాలో ఆధిపత్యం సాధించవచ్చని చైనా భావిస్తోంది. రష్యా, షాంఘై సెంట్రల్ ఆర్గనైజేషన్ ల ద్వారా పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ కారణంగానే తాలిబన్లతో సత్సంబంధాలపై ప్రకటన చేసినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.  
ఆప్ఘానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 3, 4తేదీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించినా అది సాధ్యం కాలేదు. దీంతో వారం రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాలిబన్లు ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు. అయితే దాన్ని ప్రభుత్వం స్వాగతించదని భావించి.. అన్ని రాజకీయ పార్టీలు.. ప్రజా సంఘాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: