ఆ కాంగ్రెస్ నేత అడిగాడు.. కేటీఆర్ నిమిషాల్లో పని చేసిపెట్టాడు..!?

Chakravarthi Kalyan
ఆయనో కాంగ్రెస్ నేత.. సహాయం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు  ఓ విజ్ఞప్తి చేశాడు.. అంతే.. మంత్రి కేటీఆర్ నిమిషాల్లో స్పందించారు.. అంతే.. ఆయన అడిగిన పని నిమిషాల్లో పూర్తయిపోయింది. దాంతో ఆయన ఖుషీ అయ్యారు.. కేసీఆర్, కేటీఆర్ మీరు చాలా గ్రేట్ అంటూ కృతజ్ఞతలు  తెలిపారు. ఇంతకీ ఆ కాంగ్రెస్ నేత ఎవరబ్బా అనుకుంటున్నారా.. ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతల కాదులెండి.. ఆయన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్.
కర్ణాటకలోని మాండ్యకు చెందిన శశికళ అనే ఓ మహిళ తన భర్తకు కరోనా సోకగా.. చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చింది. కొన్ని రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత సదరు రోగి చనిపోయాడు.  అయితే ఆ ఆసుపత్రి వారు ఏడున్నర లక్షల రూపాయల బిల్లు వేశారు. కానీ.. సదరు శశికళ వద్ద కేవలం 2 లక్షల రూపాయలే ఉన్నాయి. దీంతో ఆ ఆసుపత్రి మృతదేహాన్ని వారికి అప్పగించడం లేదట. ఈ విషయాన్ని డీకే శివకుమార్ ట్విట్టర్ ద్వారా కేసీఆర్, కేటీఆర్‌లకు తెలిపారు.
డీకే శివకుమార్ తన ట్విట్టర్‌లో అలా ట్వీట్ పెట్టారో లేదో వెంటనే అంటే నిమిషాల వ్యవధిలోనే కేటీఆర్ స్పందించారు. శివకుమార్ గారూ.. ఆ మహిళ కాంటాక్ట్ డిటైల్స్ పెట్టండి.. మేం కనుక్కుంటాం అని స్పందించారు. అంతే కాదు.. ఆ ఆసుపత్రి వాళ్లతో మాట్లాడాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అంతే.. కేటీఆర్ ఆఫీసు నుంచి ఫోన్ వెళ్లాక ఇక పని కాకుండా ఉంటుందా.. ఆ ఆసుపత్రి వాళ్లు మృత దేహం ఇచ్చేందుకు అంగీకరించారు. అంతే.. బాధితురాలు.. విషయాన్ని శివకుమార్‌కు తెలియజేసినట్టుంది.. వెంటనే డీకే శివకుమార్ స్పందించారు.
సున్నితమైన అంశంపై  కేసీఆర్, కేటీఆర్ స్పందించిన తీరు అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మీ జోక్యంతో కరోనా రోగి మృత దేహం అప్పగించారని.. అందుకు కృతజ్ఞతలనీ శివకుమార్ ట్విట్టర్‌లో స్పందించారు. శివకుమార్ ట్వీట్‌కు మరోసారి స్పందించిన కేటీఆర్.. వెల్కమ్‌ సర్.. ఇది మా బాధ్యత అంటూ స్పందించారు. మొత్తానికి పొరుగు రాష్ట్రం కాంగ్రెస్ నేత ఫిర్యాదుపై కేటీఆర్ టీమ్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: