విరాళాలు ఇవ్వొద్దన్న ఒవైసీ!

SRISHIVA
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసి  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని ఆయన పిలుపిచ్చారు. అయోధ్యలో కడుతున్న నిర్మాణం ప్రజలు కోరుకున్నది కాదన్నారు అసద్. అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమైంది. దీనికోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కూడా కొనసాగుతోంది. అటు అయోధ్యలో మసీదు నిర్మాణానికి కూడా ముస్లిం పెద్దలు సిద్ధమయ్యారు. మ‌సీదు నిర్మాణానికి రిప‌బ్లిక్ డే రోజున శ్రీకారం చుట్టారు.ఈ నేపథ్యంలో అయోధ్యలో మసీదు నిర్మాణంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
        అయోధ్య‌లో బాబ్రీ మసీదు కూల్చిన చోట నిర్మిస్తున్న‌ మసీదుకు ఎవ‌రూ విరాళాలు ఇవ్వ‌వద్దని ఎంపీ అసద్ పిలుపునిచ్చారు. ఇపుడు కట్టే మ‌సీదులో న‌మాజ్ చేయ‌డం పాపమని అయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  అయోధ్య మసీదు ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని ఒవైసీ చెప్పారు. బాబ్రీ మసీదును కూల్చిన చోట మసీదును నిర్మించడం అనైతికమని వ్యాఖ్యానించారు. అలాంటి చోట ప్రార్థనలు చేయడం కూడా తప్పేనని మత పెద్దలు చెపుతున్నారని అన్నారు. మసీదు నిర్మాణానికి చందాలు ఇవ్వడం తప్పని చెప్పారు.
     అయోధ్య‌లో క‌డుతున్న ఆ నిర్మాణం మ‌సీదు కాద‌ని, అక్క‌డ ప్రార్థ‌న‌లు చేయ‌కూడ‌ద‌ని ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డుకు చెందిన ఉలేమాలే చెబుతున్నారని ప్ర‌స్తావించారు అసదుద్దీన్ ఒవైసీ. అంతేకాదు ముస్లింలు ఎవరూ ఎన్నికల్లో దళితులతో పోటీ పడవద్దని అయన సూచించారు. తాను అంబేద్కర్ అభిమానినని.. దళితులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో శాంతి కోరుకునే వారిని జైలుకు పంపిస్తున్నారని అసద్ ఆరోపించారు.
   ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్‌ వ్యాఖ్య‌ల‌ను అయోధ్య మ‌సీదు ట్రస్ట్ సెక్ర‌ట‌రీ అథ‌ర్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. అసద్ వ్యాఖ్యలు అయన రాజ‌కీయ ఎజెండాలో భాగ‌మని విమ‌ర్శించారు. ఇస్లాంకు వ్య‌తిరేకమైన చిన్న ప్ర‌దేశం కూడా ఈ ప్ర‌పంచంలో లేద‌ని హుస్సేన్ అన్నారు. ఎంపీ అస‌దుద్దీన్‌కు భారతదేశ చరిత్ర తెలియ‌దని అథ‌ర్ హుస్సేన్ విమ‌ర్శించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: