భారత్ - చైనా మధ్య వివాదాస్పద స్థలాలు ఇవే !

Suma Kallamadi

దశాబ్దాలుగా భారత్​ సరిహద్దులోని అనేక ప్రాంతాలను చైనా తనవిగా చెబుతూ ఆక్రమణలకు పాల్పడుతోంది. వాస్తవాధీన రేఖను అతిక్రమిస్తూ ఒప్పందాలకు తూట్లు పొడుస్తోంది. ఇప్పటికే అక్సాయిచిన్​లో పాగా వేసింది. అరుణాచల్​ ప్రదేశ్​తో పాటు చాలా ప్రాంతాలపై వివాదాన్ని సృష్టిస్తోంది.

 

అక్సాయిచిన్‌: రెండు దేశాల మధ్య అత్యంత వివాదాస్పద భూభాగం ఇది. 38 వేల చ.కి.మీ.లు విస్తరించి ఉంది. ఇది తమ లద్దాఖ్‌లోని భాగమని భారత్‌ చెబుతోంది. అయితే 1950ల నుంచీ ఇది తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా దీన్ని తన ఆక్రమణలో ఉంచుకుంది. 1962లో అక్సాయిచిన్‌లో భూభాగం గుండా టిబెట్‌లోని ఝింజియాంగ్‌కు చైనా హైవేను నిర్మించింది.

 

దెమ్‌ చోక్‌: లద్దాఖ్‌లోని లేహ్‌లో ఉన్న ఈ గ్రామం భారత సైనిక స్థావరం. ఇక్కడ తరచూ చైనా బలగాలతో ఘర్షణలు జరుగుతుంటాయి. సిక్కిం నుంచి మయన్మార్‌ సరిహద్దు దాకా వ్యాపించి ఉంది. ఈ సెక్టార్లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే వివాదాస్పద ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అరుణాచల్‌ మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది.

 

 

అసాఫిలా: ఎగువ సుబన్‌సరి డివిజన్‌లో దాదాపు 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దట్టమైన అటవీ, పర్వత ప్రాంతమిది. 1962 యుద్ధంలో చైనా ప్రధానంగా ఇక్కడ్నుంచే భారత్‌పై దాడికి దిగింది. ఈ ప్రాంతం భారత్‌, చైనాల్లో ఎవరి ఆధీనంలోనూ లేదు.

 

 

లోంగ్జూ: ఎగువ సుబన్‌సిరి డివిజన్‌లో ఉంది. టిబెట్‌లోని చైనా సైనిక పోస్టులకు అభిముఖంగా ఈ ప్రాంతం ఉంది. 1959లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి, అస్సాం రైఫిల్స్‌కు మధ్య మొట్టమొదటి ఘర్షణ ఇక్కడే చోటుచేసుకుంది. లోంగ్జూను భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకోలేదు. అక్కడికి 10 కి.మీల దూరంలో మాజా వద్ద ఒక సైనిక పోస్టును మాత్రం ఏర్పాటుచేసింది.

 

నమ్కా చూ(నదీ) లోయ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. 1962లో భారత్‌-చైనాల మధ్య యుద్ధం ఇక్కడే ప్రారంభమైంది.


సుమ్‌దోరాంగ్‌ చూ(తవాంగ్‌ జిల్లా): నమ్కా చూకు తూర్పున ఉన్న నదీ పరీవాహక ప్రాంతమిది. 1986లో చైనా సైన్యం దీన్ని ఆక్రమించింది.

 

 

యాంగ్జే(తవాంగ్‌ జిల్లా): సుమ్‌దోరాంగ్‌ చూ దురాక్రమణకు ప్రతీకారంగా భారత సైన్యం 1986లో దీన్ని ఆక్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: