జగన్ని ఆదుకున్న వైఎస్ ఫ్రెండ్...లేకపోతేనా...!!

Satya
తండ్రి స్నేహితున్ని తండ్రి అంతటి వారు అంటాం. కష్టాల్లో పడిన తన మిత్రుడు కొడుకుని ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. వైఎస్సార్ కి రాజకీయాల్లో ఎందరో స్నేహితులు ఉన్నారు. ఆయన చనిపోకముందు ఒకలా, పోయిన తరువాత మరొకలా వ్యవహరించారు. దాన్ని జగన్ తో పాటు లోకమంతా కళ్లారా చూసింది. జగన్ని ఎన్ని బాధలు పడ్డారో అందరికీ తెలిసిందే.


ఇదిలా ఉండగా వైఎస్సార్ ఫ్రెండ్ అంటే మరేవరో కాదు వరుణుడు. ఆయన 2004 నుంచి 2009 వరకూ క్రమం తప్పకుండా వానలు కురిపించి ఏపీని సస్యశ్యామలం చేశాడు. దీంతో  వైఎస్ పాలన స్వర్ణయుగమని రైతులు భావించేవారు. . తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో పాటు, విభజన ఏపీని అయిదేళ్ళ పాటు ఏలిన చంద్రబాబు జమానాలో సైతం వరుణుడు పెద్దగా కరుణించలేదు.


ఇపుడు వైఎస్ తనయుడి పాలన వచ్చింది. ఏపీలోని జలాశయాలు అన్ని నిండు కుండలుగా మారిపోయాయి. వరుణుడి దయ ఎంతలా ఉందంటే రాజన్న బిడ్డకు చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశ్యంతో రికార్డ్ స్థాయిలో వానలు కురిసి మరీ  ప్రాజెక్టులకు నీళ్ళు తెప్పిస్తున్నాడు. దీంతో పదేళ్ల తర్వాత ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి, వంశధార నదులు పొంగిపొరలుతున్న అద్భుత ఘట్టాన్ని ఏపీ జనం చూస్తున్నారు.


ఇక గోదావరి, కృష్ణా డెల్టాలు, వంశధార, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టులో మొదలైన పంటల సాగుతో రైతన్న ఆనందం పట్టనలవి కాకుండా ఉంది. దీంతో నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు వైసీపీ సర్కార్ నీటిని విడుదల చేసింది. నిజంగా ఆగస్టు రెండో వారంలోగా నీటిని విడుదల చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని రైతులు పొంగిపోతున్నారు.


అలాగే,  ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు సాగునీరు విడుదలతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇంతలా నీటి కష్టాలు తీరుతాయని అనుకోలేదని అన్నదాతలు పట్టలేని  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా తొలి దశ ఆయకట్టుకు నీళ్లందించడానికి కూడా జగన్ ప్రభుత్వం చర్యలు ఇపుడు తీసుకుంటోంది. 


ఇక శ్రీశైలం డ్యాం కట్టిన తరువాత ఇప్పటికి అయిదు సార్లు మాత్రమే జల అద్భుతం జరిగిందట. పూర్తిగా నీరు నిండి జలాశయం నిండు గర్బిణిగా ఉన్నది 28 ఏళ్ల తరువాత జగన్ సర్కార్ లో ఇదే తొలిసారిట. దాంతో శ్రీశైలం డ్యాం వద్ద జనం సందడి చేస్తున్నారు. అక్కడంతా సెల్ఫీల గోలతో హోరెత్తిపోతోంది. మొత్తానికి వరుణుడు వైఎస్సార్ నిజమైన మిత్రుడు అనిపించాడంటున్నారు. లేకపోతే నీళ్ళు లేక, రాక రైతుల ఆక్రందనలతో జగన్ సర్కార్ కి ఆదిలోనే అతి పెద్ద ఆపద ఎదురయ్యేదని కూడా అంటున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: