గొట్టా బ్యారేజీ..పారేదెట్టా.. -ఉద్యోగులు , సిబ్బంది కొరతతో గొట్టా బ్యారేజీ నిర్వాహణలో లోపం.

SEEKOTI TRIMURTHULU
గొట్టా బ్యారేజి..జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు. ఖరీఫ్ లో వేలాది ఎకరాల పంట భూములకు సాగునీటిని అందిస్తూ కరువు కాలంలో నేనున్నానంటూ ఆదుకుంటున్న ఈ బ్యారేజీ నిర్వాహణకు ఉద్యోగులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దశాబ్దాల కిందట నియమించిన ఉద్యోగులు కొన్నేళ్లుగా ఒక్కొక్కరు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. చివరకు ఏడుగురు ఉద్యోగులు మాత్రమే మిగిలారు. వరదల సమయంలో వీరితోనే బ్యారేజి నిర్వహణ పనులు కొనసాగడంతో  అధికారులకు కష్టమవుతోంది. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో తాత్కాలిక పద్ధతిలోనైనా నియామకాలు చేపట్టాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్టాబ్యారేజి నిర్వాహణకు ఉద్యోగుల , సిబ్బంది కొరత వెంటాడుదుతుంది. ఖరీఫ్ సీజన్, వరదల సమయంలో బ్యారేజి నిర్వాహణకు గతంలో 22 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండేవారు. వర్క్, ఇన్స్పెక్షన్ , హెల్పర్స్   , ఎలట్రీషియన్స్ ఇలా పలువురు సిబ్బంది ఉండేది. గతంలో పనిచేసిన చాల మంది పదవి విరమణ పొందారు. కానీ ప్రభుత్వం  వారి స్థానాల్లో కొత్తవారిని నియమించడంలో అశ్రద్ధ వహిస్తుంది. ప్రస్తుత్తం ఏడుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా, వారిపై అదనపు భారం పడుతోంది. నదికి వరదలు వచ్చే సమయంలో బ్యారేజి గట్లు నిర్వహణ , విద్యుత్ సరఫరా వ్యవస్థ, సీడ్యూసీ నుంచి వివరాలు సేకరణ ఇలా ఏ పని చేయాలన్న వీరే ఆధారమవుతున్నారు.

షిఫ్ట్ పద్దతి ఉన్నా తగినంత సిబ్బంది లేకపోవడంతో వరదల సమయంలో వీరే రాత్రీపగలూ విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే  గొట్టా బ్యారేజి కుడి, ఎడమ కాలువల నిర్వహణకు లష్కర్లు పూర్తిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురుకోవాల్సివస్తోంది. ప్రధాన కాలువల పరిధిలో ప్రతీ నాలుగు కిలో మీటర్లకు ఒక లష్కర్  ఉండాలి. కాలువలకు అనుసంధానంగా ఉన్న పిల్లకాల్వల ద్వారా నీరు విడుదల, కాలువల పటిష్టతపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు పై స్థాయి అధికారులకు సమాచారం అందించాలి. కానీ తగినంత సిబ్బంది లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: