అమెరికా ఆందోళనకు ఇండియా ధీటైన సమాధానం..?

Suma Kallamadi
ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులను పరిరక్షించడంలో భారత్ ఎన్నో విజయాలు సాధించిందని.. ఆ విజయాల పట్ల దేశం సగర్వంగా ఫీలవుతోందని కేంద్రం వ్యాఖ్యానించింది. భారతదేశంలో మానవ హక్కుల గురించి అగ్రరాజ్య ప్రతినిధులు 2 రోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, వారు పలు వ్యాఖ్యలు కూడా చేశారు. దీనితో భారత్‌ ధీటైన సమాధానం ఇచ్చింది. ఈరోజు అనగా జులై 27న ఆంటోనీ బ్లింకెన్‌ భారత్‌కు విచ్చేయనున్నారు. రెండు రోజుల పాటు ఆయన భారత దేశంలోనే ఉండనున్నారు.
అయితే భారతదేశంలోని మానవహక్కులు, ప్రజాస్వామ్య విలువలపై ఆంటోనీ బ్లింకెన్‌ చర్చించనున్నారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం రోజు ఒక అమెరికా అధికారి మాట్లాడుతూ.. భారత పర్యటన సమయంలో ఆంటోనీ బ్లింకెన్‌ మానవ హక్కుల అంశాలను లేవనెత్తనున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే భారత్ అమెరికా అధికారి వ్యాఖ్యలకు ఘాటుగా ప్రతిస్పందించింది. ఆంటోనీ బ్లింకెన్ ఇండియా కి చేరుకోగానే‌ భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ కలవనున్నారని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ తో కూడా సమావేశం కానున్నారని సమాచారం. అలాగే కాసేపు మోడీతో ముచ్చటించనున్నారని తెలుస్తోంది.
ఇకపోతే మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు ప్రపంచం మొత్తానికి సంబంధించినవని.. వాటికి ఎలాంటి పరిధులు ఉండవని కేంద్రం చెప్పుకొచ్చింది. వైవిధ్యత, భిన్నత్వానికి పెద్ద పీట వేసే ప్రతి దేశంతోనూ తాము కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం వ్యాఖ్యానించింది. అయితే ఒక అమెరికా అధికారి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులను పరిరక్షించడంలో భారతదేశం, అమెరికా ఒకే పద్ధతిని పాటిస్తున్నాయని అన్నారు. అందుకే ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల గురించి చర్చించడానికి తమ దేశ అధికారి ఇండియాకి వస్తున్నారని ఆయన వెల్లడించారు.
అయితే ఈ సమావేశంలో ఇండియా అమెరికాతో కలిసి ప్రపంచ రాజకీయ సమస్యలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా-భారత్ కలిసి పని చేసే విషయంలో కూడా సుదీర్ఘమైన చర్చలు జరుపుతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: