భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తీసిన ఓ ఫోటో ప్రకృతి ప్రియులందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఆయన ఫోటో చూసి నేచర్ ఫోటోగ్రఫీ న్యాయనిర్ణేతలు సైతం మంత్రముగ్దులైయ్యారు. అంతేకాదు ఆ వ్యక్తికి 1,500 పౌండ్లు అనగా 1.5 లక్ష రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించారు. అయితే అందరిని ఆకట్టుకునేలా ఆ ఫోటోలో ఏముంది అని ప్రశ్నిస్తే.. కింద నుంచి చెట్టు పైకి ఎక్కుతున్న ఒక ఒరాంగూటాన్.. ఒరాంగూటాన్ అంటే ఒక జాతి కోతి. ఈ అరుదైన కోతి ఫోటో తీసి కేరళ వ్యక్తి అందరి మన్ననలను అందుకుంటున్నారు.
పూర్తి వివరాలు తెలుసుకుంటే.. కేరళకు చెందిన ఫోటోగ్రాఫర్ థామస్ విజయన్ కెనడా కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అయితే ఇటీవల ఆయన బోర్నియో వెళ్లి ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించారు. ఇదే క్రమంలో ఆయన చెట్టు ఎక్కుతున్న ఒక ఒరాంగూటాన్ ని అత్యద్భుతంగా ఫోటో తీశాడు. ఈ ఫోటోకి 'ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్‌సైడ్ డౌన్' అని నిగూడార్థం గల ఒక శీర్షికను జోడించారు. ఈ ఫోటో తీయడానికి థామస్ విజయన్ కొద్దిరోజుల పాటు బోర్నియోలో ఉండిపోయారు.
ఈ ఫొటో పర్ఫెక్ట్ గా రావడానికి ఆయన నీటిలో ఉన్న ఒక చెట్టు ని ఎంపిక చేసుకున్నారు. ఆకాశం తో పాటు చెట్టు ఆకులు కూడా నీటిలో చాలా సహజంగా ప్రతిబింబిస్తాయని తాను నీటిలో ఉన్న చెట్టు ని ఎంపిక చేసుకున్నారని చెప్పారు. అయితే నీరు ఆకాశాన్ని స్పష్టంగా చూపించే అద్దం లా మారటంతో.. ఒరాంగూటాన్ చెట్టు పై నుంచి కిందకి తలకిందులుగా దిగుతున్నట్టు బ్రాంతి కలిగింది. అయితే ఇటువంటి అబ్బురపడే భ్రాంతి సృష్టించడానికి ఆయన చెట్టు పైన గంటలకొద్దీ వేచి చూశారట. అయితే ఆయన నిరీక్షణకు తగ్గ ఫోటో కెమెరా లో బంధీ కావటంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే ఈ ఫోటో చాలా బాగా తీసిన థామస్ విజయన్ కి నేచర్ టీటీఎల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు కూడా లభించింది. ఈ అవార్డుతో పాటు ఆయనకు రూ.1.5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా నేచర్ టీటీఎల్ ఫొటోగ్రాఫర్ సంస్థ ప్రకటించింది. ఒరాంగూటాన్ జాతి కోతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఒకప్పుడు ఒరాంగూటాన్ కోతులు విపరీతంగా ఉండేవి కానీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గుతుండటంతో.. 'ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్‌సైడ్ డౌన్' అని ఈ కేరళ ఫోటోగ్రాఫర్ ఒక ఎమోషనల్ క్యాప్షన్ జోడించారు. అయితే ఈ ఫోటోతోనైనా వీటి సంఖ్య పెంచే దిశగా వన్య ప్రాణ రక్షకులు చర్యలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.