ఒక్క టీకా తీసుకొని కోట్లు గెలుచుకుంది.. ఎలాగో తెలుసా..?

Suma Kallamadi
అమెరికా దేశానికి చెందిన 22 ఏళ్ల యువతి ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అయ్యారు. ఊహించని రీతిలో ఆమెను అదృష్టం వరించడంతో అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయిపోయాయి. దీనితో ఆ యువతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. అమెరికాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జో బైడెన్ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నారు. కరోనా నుంచి అమెరికాని రక్షించాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గమని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా అమెరికాలో నివసించే ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా చేయాలని.. లక్ష్యాలను పెట్టుకొన్న ఆయన టీకా ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో ఆయన అనుకున్న సమయం కంటే ముందస్తుగానే ప్రజలకు టీకాలు అందించడం చాలా వరకు పూర్తయింది.


ఈ నేపథ్యంలోనే జో బైడెన్ మరొక కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్నారు. జూలై 4 తేదీలోపు 70 శాతం మంది 18ఏళ్లు నిండిన యువతకు టీకా వేయించాలని ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అలాగే 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత మాత్రం ముందుకు రావడం లేదు. ఇది తెలుసుకున్న బైడెన్ యువతీ యువకులను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఒక మంచి ఉపాయం ఆలోచించాలని ఆదేశించారు. ఇందులోని భాగంగానే ఓహియో రాష్ట్రం యువతను వ్యాక్సిన్‌వైపు మళ్లీంచేందుకు ఓ కళ్ళు చెదిరే ఆఫర్ ని ప్రకటించింది. 'వ్యాక్స్ ఏ మిలియన్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. టీకా తీసుకున్న యువతను లాటరీ విధానంలో సెలెక్ట్ చేసి విన్నర్ లకు 10 లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తామని వెల్లడించింది.


దీంతో యువత తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టీకాలు తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ అయిన అబ్బిగైల్ బుగెన్స్కే(22) తన మొదటి డోసు టీకా తీసుకుంది. కాగా, అధికారులు బుధవారం రోజు 'వ్యాక్స్ ఏ మిలియన్' కార్యక్రమంలో భాగంగా డ్రా తీశారు. దీనితో 10 లక్షల డాలర్లు అబ్బిగైల్ ని వరించినట్లు తేలింది. అనంతరం ఓహియే రాష్ట్ర గవర్నర్ లాటరీ ఫలితాలు వెల్లడిస్తూ.. అబ్బిగైల్ బుగెన్స్కే 1 మిలియన్ డాలర్లను గెలుపొందారని ప్రకటించారు. అంతేకాకుండా సాక్షాత్తు గవర్నరే ఫోన్ చేసి "మీరు ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు" అని యువతికి చెప్పడంతో ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇకపోతే మరో నెల రోజులపాటు 'వ్యాక్స్ ఏ మిలియన్' కార్యక్రమం కొనసాగుతుందని.. ఈ సమయంలో లక్కీ డ్రాలో విజేతలకు 1 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తామని అధికారులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: