కరోనా వైరస్ ని అడ్డుపెట్టుకొని చాలామంది అక్రమంగా తమ బ్యాంకు ఖాతాలను లక్షలు, కోట్ల రూపాయలతో నింపుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న మందులను ఆక్సిజన్ సిలిండర్ లను సైతం బ్లాక్ లో అధిక ధరలకు అమ్మేస్తున్నారు. ఇందులోని భాగంగానే పాట్నాకు చెందిన హర్ష రాజు అనే ఒక యువకుడు న్యూయార్క్‌లో పనిచేసే ఏరోస్పేస్ ఇంజనీర్ కోరిక మేరకు ఆక్సిజన్ సిలిండర్, ఫ్లో మీటర్, గేజ్ అమర్చిన రెగ్యులేటర్ సమకూర్చాడు.
అయితే ఈ వైద్య పరికరాలను అతనికి విక్రయించినందుకుగాను 1.15 లక్షల రూపాయలు ఎన్నారై నుంచి తీసుకున్నాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న పాట్నా ఎకనామిక్ యూనిట్ హర్ష రాజు ని పట్టుకుంది. అలాగే అతడికి సహకరిస్తున్న మరో ముగ్గురిని కూడా కటకటాల పాలు చేసింది.
న్యూయార్క్‌లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఎన్ఆర్ఐ పాట్నా లో పుట్టి పెరిగారు. అయితే అతని తల్లిదండ్రులు కరోనా వైరస్ బారిన పడటంతో ఆక్సిజన్ సిలిండర్ కావాలని మే 6వ తేదీన హర్ష రాజు కు ఎన్ఆర్ఐ మెసేజ్ పంపించారు. కాగా, హర్ష రాజు ఒక రిక్షా లో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తున్న క్రమంలోనే అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఐదు రోజుల సమయం లోనే రూ.9 లక్షల వరకూ హర్ష రాజు బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే బ్లాక్ లో ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు చేస్తూ ఇంజనీర్ అడ్డంగా బుక్కయ్యారు కానీ అతను పేరు, వివరాలు బయట పెట్టలేదు.
ఇకపోతే గతేడాది ఓపెన్ కాలేజీ ద్వారా 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన హర్ష రాజు పాట్నాలోని శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేష్ నగర్ వద్ద మామయ్యతో కలిసి నివసిస్తున్నాడు. ప్రస్తుత కరోనా సంక్షోభం లో ఆక్సిజన్ సిలిండర్లు విక్రయిస్తున్నామని చెబుతూ అతను తన కాంటాక్ట్ నంబర్లను కూడా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టాడు. ఈ పోస్టుల ద్వారా ఒక మహిళా కానిస్టేబుల్ హర్ష రాజుకి మెసేజ్లు పంపించి తమకు కూడా ఒక ఆక్సిజన్ సిలిండర్ కావాలని అడిగారు. ఈ విధంగా అతను కస్టమర్ల నుంచి ఎంత డబ్బు డిమాండ్ చేస్తున్నాడనే విషయాలు కనుగొన్నారు.