ఎన్టీఆర్ తిట్టిన తిట్లను ఎంజాయ్ చేసిన రాజేంద్రప్రసాద్ !

Seetha Sailaja
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ హీరోగా మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలు పోషించగల సీనియర్ నటులలో రాజేంద్రప్రసాద్ కు ఒక ప్రముఖ స్థానం ఉంది. తన కామెడీ మార్క్ పంచ్ తో 'లేడీస్ టైలర్' నుంచి ఇటీవల విడుదలైన 'ఎఫ్ 2' వరకు రాజేంద్రప్రసాద్ ఏ స్థాయిలో అయినా నవ్వించగలడు అన్న విషయం మరొకసారి రుజువైంది. ఈమధ్య విజయవాడలో జరిగిన ఒక సాంస్కృతిక సంస్థ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

ఒక సినిమా ఘన విజయంలో అందరి పాత్ర ఉంటుందని అంటూ తాను నటించిన ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించినా ఆవిజయాలు తన వల్లనే వచ్చాయని అని అనుకునేంత అమాయకుడుని కాని అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ప్రతి సినిమా విజయం వెనుక ఆసినిమాలో నటించిన హీరో దగ్గర నుండి ఆ సినిమాకోసం పనిచేసిన లైట్ బాయ్ వరకు ఆసినిమా విజయం దక్కుతుందని అంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసాడు. 

ఇదే సందర్భంలో తాను ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తరువాత నందమూరి తారకరామారావు స్పూర్తితో ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన విషయాన్ని వివరిస్తూ తన తొలి సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని వివరించాడు. తన తొలి సినిమా విడుదల అయిన తరువాత విజయవాడలోని అలంకార్ టాకీసు దారిలో తన తొలిసినిమా పోస్టర్ ను చూసి ఆనందపడి కొంత సమయం పూర్తి కాకుండానే మరొక చోట తన సినిమా పోస్టర్ పై ఎవరో పేడ వేసిన సందర్భాన్ని చూసి బాధపడిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

ఈ విషయంతో బాధపడి తాను ఎన్టీఆర్ వద్దకు వెళ్ళి సినిమాల నుంచి వెళ్ళిపోతాను అని చెప్పగానే ఎన్టీఆర్ కోపంతో తన వంక చూస్తూ ‘బుద్దిలేని గాడిద సహనం లేనప్పుడు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు’ అంటూ ప్రేమగా తనను ఎన్టీఆర్ మందలించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు ఏ వ్యక్తి అయినా మనలను తిట్టాడు లేక మరొక విధంగా ప్రవర్తించాడు అంటే మన మీద ఆ వ్యక్తికి 100 శాతం ఎటెన్షన్ ఉన్నట్లు అనుకోవాలి అంటూ ఆనాడు నందమూరి తారకరామారావు చెప్పిన మాటలు వల్ల తాను నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అంటూ తన ఉన్నతికి ఎన్టీఆర్ కారకుడు అంటూ తనలోని భావాలను బయటపెట్టాడు ఈ నటకిరీటి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: