విశ్వనాయకుడు వినాయకుడు !

Seetha Sailaja
భారతీయ సంస్కృతిలో పండుగలకు విశేష ప్రాధాన్యత ఉంది. అలాంటి పండుగలలో అత్యంత విశిష్టంగా భావించే ‘వినాయకచవితి’ పండుగను విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగగా భావిస్తూ మనదేశంలో కుల మతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకునే సాంప్రదాయం. క్రీస్తుపూర్వం ౩౦౦౦ వేల సంవత్సరాల నుండి మన భారతీయ సంస్కృతిలో కలిసి పోయిందని చరిత్రకారులు చెపుతారు. వినాయకుని రూపం మట్టిలో పుట్టి మట్టిలో కలసిపోయే స్వభావం అనేక విషయాలను తెలియజేస్తాయి.

చాటంత చెవులు పెద్ద పొట్ట చిన్ని కళ్ళు ఏనుగు ముఖం నోటికి అడ్డంగా తొండం వీటిలో ప్రతిదాని వెనుకా ఒక వేదాంత  పరమార్థం ఉంది. 
తక్కువ మాట్లాడమని నోటికి ఆడ్డుగా ఉన్న తొండం సూచిస్తే, ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలని చెవులూ ఆవిన్న వాటిని భద్రంగా దాచుకోవాలని కడుపూ చెప్పకనే చెబుతాయి. వినాయకుడి సూక్ష్మ దృష్టికి నిదర్శనం ఆయన చిన్ని కళ్లు. ఏదైనా కార్యం సాధించాలంటే కావల్సింది శక్తియుక్తులే కానీ సౌకర్యాలూ ఆర్భాటాలూ కావని ఆయన ఎలుక వాహనం సూచిస్తుంది. ఇలా గణపతి రూపంలో అణువణువునా  ఒక్కో విశిష్టత దాగి ఉంది.

భాద్రపద శుద్ధ చవితి రోజన విఘ్నేశ్వరుడు పుట్టినరోజు అని కూడా కొందరు అంటారు. వినాయకుడు గణాధిపత్యం పొందిన రోజని మరికొందరు భావిస్తారు. బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన ఘంటకుడిగా వినాయకుడిని నియమించుకున్న విషయాలను పురాణాలు చెపుతున్నాయి. 

గణపతిని మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని ఆరు రూపాల్లో పూజిస్తారు. సనాతన సాంప్రదాయం ప్రకారం ఏపూజలు చేసినా ఎలాంటి యజ్ఞ యాగాదులు చేసినా వినాయకుడికి ప్రధమ పూజ చేయకుండా మన సాంప్రదాయంలో ఎటువంటు పూజలు ప్రారంభం కావు. క్రీస్తుశకం ప్రారంభం కాకముందే ఏర్పడ్డ జైన బౌద్ధ మతాలలో కూడ గణపతి ఆరాధన ఉంది. కేవలం మన దేశంలోనే కాకుండా శ్రీలంకా బర్మా చైనా జపాన్ ఇండోనేషియా ఇరాన్ మలేషియా కంబోడియా దేశాలలో కూడ గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈవిషయాలన్నీపరిశీలిస్తే వినాయకుడు కేవలం భారతీయలకు మాత్రమే ఆరాధ్య దేవుడు కాదు. వినాయకుడు ‘విశ్వనాయకుడు’ తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు   ఉన్నా ఈరోజు విఘ్నేషుడు కి పూజ చేయకుండా ఉండరు. ఈరోజు జరుపుకుంటున్న ఈ వినాయకచవితి పండుగ ప్రతి తెలుగు వారింటిలో విఘ్నాలు తొలగించి అందరికి సకల శుభాలు కలిగించాలని ఆ వినాయకుడుని కోరుకుంటూ ఇండియన్ హెరాల్డ్ అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: