కత్తీ.. పవన్ మౌనాన్ని చేతకానితనంగా తీసుకోకు..!

Vasishta

పవన్ కల్యాణ్ పై రోజూ విరుచుకుపడుతున్న కత్తి మహేశ్ పై రచయిత కోన వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వారిని బదనాం చేసే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. హీరోల మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ పై ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆయన నోరుపారేసుకోకపోవడం ఆయన సంస్కారమన్నారు.


ఇటీవలికాలంలో హీరోలు, హీరోయిన్లపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయన, వారిపై విచ్చలవిడిగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారని కోన వెంకట్ చెప్పారు. అయితే వాస్తవాలు తెలుసుకోకుండా పోస్ట్ చేస్తున్న ఇలాంటి వీడియోల వెనుక ఎంతటి మానసికక్షోభ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసి కామెంట్ చేసే అర్హత ఎవరికీ లేదన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి అందరికీ ఎదురవుతుంటాయని, అలాంటివాటిని ఆధారంగా చేసుకుని కామెంట్ చేసే హక్కు ఇతరులకు ఎక్కడిదని కోన వెంకటే ప్రశ్నించారు.


కత్తి మహేష్ లాంటి లోకజ్ఞానులు వారి జ్ఞానాన్ని సమాజంకోసం పెడితే బాగుంటుందని సూచించారు. కత్తి మహేశ్ ఆ స్థాయిలో విమర్శిస్తున్నా పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం ఆయన గొప్పతనమేనన్నారు. పవన్ తన జీవితంలో ఒక్కరిని కూడా బాధపెట్టి ఉండరన్నారు. అందుకే ఆయన కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారని కోన వెంకట్ కొనియాడారు. తనకున్న ప్రజాభిమానాన్ని రాజకీయానికి ఉపయోగిస్తే సమాజానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే పవన్ పార్టీ పెడుతున్నారని ఆయన వెల్లడించారు. పవన్ సంకల్పబలం ముందు ఈ శక్తీ నిలవదన్నారు.


పవన్ మాత్రమే కాకుండా తారక్, మహేశ్ బాబు, బాలయ్య లాంటి ఎందరో హీరోలు వ్యక్తిగత విమర్శలను సానుకూలంగానే తీసుకుంటారని కోన వెంకట్ అన్నారు. ఎవరో ఏదో ఒక రాయి విసిరితే దాన్ని పట్టించుకుని స్పందించేంత తీరిక వారికి ఉండదన్నారు. అలాగని వారి మౌనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మాత్రం అది అమాయకత్వమే అవుతుందని హెచ్చరించారు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందన్న ఆయన.. అందరూ సంయమనం పాటించాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: