24 గంటల్లో ఒక మిలియన్‌ బహుబలి 2 టికెట్లు సోల్డ్: బుక్‌-మై-షో






మనం ఇక ఈ రోజు నుండి మరో పదిరోజుల వరకు బాహుబలి రికార్డులను చూడటము తోనే అలసిపోతామనుకుంటా !  కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో?  తెలుసు కోవడానికి ఇంకా కొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 ది కన్‌క్లూజన్‌ శుక్రవారం 9 వేల థియేటర్లలో విడుదల కాబోతోంది. దేశవ్యాప్తంగా 6,500 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. 




ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద టికెట్ల కోసం బారులు తీరుతున్నారు. ప్రముఖ టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయ పోర్టల్‌ ‘బుక్‌ మై షో’లో  ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ సినిమాకు సంబంధించిన టికెట్లను అందుబాటు లోకి తీసుకురాగా 24 గంటల్లో ఒక మిలియన్‌ టికెట్లు అమ్ముడుపోయినట్లు సదరు పోర్టల్‌ సిబ్బంది తెలిపారు. రికార్డు స్థాయి బుకింగ్‌ని తాము వూహించలేదని, దక్షిణాది ప్రాంతాల్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయాయని, ఒక్క రోజుకే ఇంత భారీ స్పంధన రావడం అమితాశ్చర్యానికి గురిచేసిందని ఆయన తెలిపారు. మల్టీఫ్లెక్స్‌ల్లో ఇప్పటికే దాదాపు తొలి వారం టిక్కెట్లు అయిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి.




బాహుబలి 2 అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు ముందే మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ "బుక్ మై షో"  వెల్లడించిన విషయం సగటు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా కోసం ఎంతలా తహతహ లాడుతూ ఎదురు చూస్తున్నాడో చెప్పేసింది. టికెట్స్ బుకింగ్‌ లో అమీర్ ఖాన్ దంగల్ సినిమా రికార్డ్‌ను బాహుబలి 2 దాటేసిందని "బుక్‌మైషో"  తెలిపింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే? ఒక్క ప్రశ్నకు సమాధానం కోసమే సగం మంది ప్రేక్షకులు ఈ సినిమా చూడాలని భావిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదేమో?


ఏదేమైనా ఒక తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు రావడం ఇదే తొలిసారి. పైగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఇప్పటికే భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించింది ఈ సినిమా. తాజాగా ఈ బుక్‌ మై షో చెప్పిన దాన్ని బట్టి సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 24 గంటల్లో ఒక మిలియన్‌ టికెట్లు అమ్ముడు పోయినట్లు ఓ ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయ పోర్టల్‌ వెల్లడించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: