ఆస్కార్ ఫ్లాష్ బ్యాక్ తెలుసా..?

Prasad Bura
సినీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి లక్ష్యం.. ఆస్కార్‌ అవార్డ్‌. ఇది లభిస్తే సినీరంగంలో ఉన్న ఎవరైనా తమ జన్మధన్యమైందని భావిస్తుంటారు.  కానీ ఆ అదృష్టం కొంతమందినే వరిస్తుంది. మరి అలాంటి ఆస్కార్‌ అవార్డుకు ఆ పేరెలా వచ్చింది. ఆస్కార్‌ వెనుక ఉన్న హిస్టరీ ఏంటి..?

ఆస్కార్‌ అందుకోవడం అంటే మాటలు కాదు. సినీ వినీలాకాశంలో అవి అత్యుత్తమ క్షణాలు. ఆ వేదికపై నిలబడడమే ఓ అదృష్టం. ఇక ఆస్కార్‌ అందుకుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఈ అవార్డుకు ఆ పేరెలా వచ్చిందంటే...  ప్రతి పేరు వెనక ఓ కథ ఉన్నట్లే... ఆస్కార్ పేరు వెనక కూడా ఓ కథ ఉంది. మొదట్లో  దీన్ని అకాడమీ అవార్డ్ అనే పిలిచేవారు. అయితే, ఆస్కార్ ప్రతిమను చూసి, అకాడమీ లైబ్రేరియన్ మార్గరెట్ హెర్రిక్ అది తన మామయ్య ఆస్కార్ మాదిరిగా ఉందని అన్నారట. అప్పట్నుంచీ ఆ ప్రతిమను ఆస్కార్ అని అక్కడి ఉద్యోగులు పిలవడం మొదలుపెట్టారు. చివరికి ఆ పేరే ఆస్కార్‌ అవార్డుగా స్థిరపడింది. 1927నుంచే ఆస్కార్ అవార్డుల ప్రధానం ప్రారంభమైంది. అయితే ఆస్కార్ అనే పేరు మాత్రం 1939 స్థిరపడింది.


1927లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అవార్డ్స్ అండ్ సెన్సైస్ అనే సంస్థ ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రారంభించింది. చిత్రరంగంలోని ప్రతిభావంతులకు ఈ అవార్డు ప్రధానం చేయాలనుకుంది ఆ సంస్థకు చెందిన కమిటీ. వారిచ్చే అవార్డు.. ఎలా ఉండాలన్నదానిపై చాలానే కసరత్తు జరిగింది. చివరకు ఆ పనిని కళాదర్శకుడు సిడ్రిక్ గిబ్సన్స్ కు అప్పగించారు. ఆయన నటీనటులు, రచయితలు, దర్శక, నిర్మాతలూ, సాంకేతిక నిపుణులు.. ఇలా చిత్రనిర్మాణంలో కీలక పాత్ర వహించే శాఖలను దృష్టిలో పెట్టుకుని ఐదు స్పోక్స్ ఉన్న ఒక ఫిలిం రీల్‌ పై ఓ వీరుడు కత్తి పట్టుకుని నిలబడినట్లుగా ప్రతిమను డిజైన్ చేశారు.

ఈ ఆస్కార్ ప్రతిమ తయారీకి కూడా భారీగా ఖర్చు అవుతుంది. ఒక్కో ఆస్కార్ ప్రతిమ తయారు చేయడానికి దాదాపు 40 గంటలు పడుతుందట. ఒక్కోదానికి సుమారు 17వేలకు పైగా ఖర్చవుతుంది. సినీ రంగంలోని మొత్తం 24 శాఖలకు అవార్డులు ప్రధానం చేస్తారు. ఒక్కోసారి ఒక్కో విభాగంలో ఇద్దరికీ     అవార్డులు ప్రధానం చేయాల్సి వస్తుంది. అందుకని, ముందు జాగ్రత్తగా 60 ప్రతిమల వరకు తయారు చేస్తారు. అవార్డ్ వేడుక పూర్తయ్యాక మిగిలిన ప్రతిమలను లాకర్లో ఉంచి సీల్ వేస్తారు. 1945 వరకు ఒక్కో ఏడాది ఒక్కో సైజ్‌ లో ఆస్కార్ ప్రతిమ ఉండేది. అయితే, ఆ తర్వాత ఒకే సైజుని ఫిక్స్ చేశారు. 13.5 అంగుళాల పొడువు, 3.85 కిలోల బరువుతో ఉంటుంది ఆస్కార్ బొమ్మ.

89 ఏళ్ల ఆస్కార్ అవార్డ్ చరిత్రలో ఎక్కువసార్లు అవార్డులు అందుకున్న వ్యక్తి వాల్ట్ డిస్నీ. వివిధ విభాగాల్లో ఆయన 22సార్లు అవార్డు గెల్చుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా నాలుగుసార్లు అవార్డ్ పొందిన ఏకైక నటి కేథరిన్ హెప్బర్న్. ఎక్కువ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు జాన్ఫోర్డ్ కావడం విశేషం.

ఈ అవార్డు ఎంపిక కళాత్మక విలువలను బట్టి జరుగుతుందనుకుంటారు కానీ.. ఓటింగును బట్టి తుది నిర్ణయం జరుగుతుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్‌ అండ్ సైన్సెస్ సభ్యులైన 5783 మంది ఓట్లు వేస్తారు. దానికి ముందు నామినేషన్ల పేరిట తొమ్మిది ఉత్తమ చిత్రాల జాబితా రూపొందిస్తారు. ప్రైజ్ వాటర్ కూపర్స్ అనే ఆడిటింగ్ సంస్థ ఓట్లను లెక్కించి ప్రకటిస్తుంది. అయితే ఈ వివరాలు గోప్యంగా వుంటాయి. ఈ ఎంపిక చేసే ఓటర్లలో 94 శాతం మంది శ్వేతజాతీయులుంటారనీ, 77 శాతం పురుషులేనని గతంలో ఓ పత్రిక వెల్లడించింది. 

గతంలో చాలా సార్లు జాతి వివక్షకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంది ఆస్కార్‌ కమిటీ. ఈ కమిటీలో రెండు శాతం మంది మాత్రమే నల్లజాతి వారు ఉంటుండగా.. మరో రెండు శాతం మంది లాటిన్ అమెరికన్లట. 15 విభాగాల్లోనైతే అచ్చంగా శ్వేతజాతి పురుషులే వున్నారట. నల్లజాతి కళాకారుల పట్ల వివక్షకు నిరసనగా గతంలో కొంతమంది ప్రముఖులు ఈ కమిటీ నుంచి నిష్క్రమించారు. ఇలా అనేక విశేషాలతో పాటు వివాదాలు కూడా ఆస్కార్‌ అవార్డు వెనుక ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: