ఎడిటోరియ‌ల్: స్టార్ హీరోల‌కు ఈ బిల్డ‌ప్పులెందుకు?

Muddam Swamy
సౌతిండియా స్టార్ హీరోల‌కు ఏమైందీ? వ‌రుసపెట్టి ఫ‌్లాపుల ఫ‌లితాలు అనుభ‌విస్తున్నారు. ఈ పాపం ఎవ‌రిది? స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయితే.. జ‌రిగే న‌ష్టం ఎంత‌? ర‌జినీకాంత్, మ‌హేష్, ప‌వ‌న్, విక్ర‌మ్ వంటి సౌత్ స్టార్ హీరోల తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. అభిమానులే కాదు సౌతిండియా సినీ ప‌రిశ్ర‌మ కూడా ఇప్పుడు నిరాశ‌తో ఉంది.


అదిరిపోయే ప‌బ్లిసిటీ.. హడావిడితో హంగామా.. క‌ళ్లు జిగేల్‌మ‌నిపించే భారీ ఫంక్ష‌న్లు.. ఇవేమి సినిమాకు ప‌నికిరావు. గ‌త ఏడాదికాలంగా చూస్తున్న నిజం ఇదే. స్టార్ హీరోల సినిమాలు డిజ‌స్ట‌ర్ల‌యి న‌ల్ల‌మోహాలు వేస్తున్నారు. ప్రేక్ష‌కుడికి కావాల్సింది కొత్త‌ద‌నం, వినోదం. ఎవ‌డిక్కావాలి ప్లాస్టిక్ మొహాల ఇమేజీ బిల్డ‌ప్పులు. స్కీన్ నిండా అన‌వ‌స‌ర‌పు హ‌డావిడి.? అందరి చూపూ 100 కోట్లపైనే. స్టోరీ, డైరెక్ట‌ర్, టెక్నిక‌ల్ టీమ్, కొత్తదనాలు, ప్రయోగాలు గాలిలో కలిసిపోయి.. కేవలం హీరో చుట్టూరా ఇండస్ట్రీ తిరుగుతోంది. హీరో డేట్స్ దొరికితే చాలు, తను చెప్పినోడే డైరెక్ట‌ర్, తను సూచించినోడే మ్యూజిక్ డైరెక్ట‌ర్, తను కోరుకున్నదే హీరోయిస్, మరీ కోరుకుంటే మరో హీరోయిన్, చివరకు హీరో ఫైండ్స్ పేరెంట్స్ పాత్రలు కూడా ఎవరు పోషించాలో హీరోయే చెబుతాడు. మరీ తిక్కలేస్తే పవస్ కల్యాణ్ లాగా దర్శకుడిని ఇంటికి పంపించేసి తనే మెగాఫోస్ పట్టుకుంటాడు. తీరా చూస్తే ఆ సినిమాలో ఏమీ ఉండదు. 


ఎక్కడా లేనట్టు ధియేటర్ల మాఫియా సినీ ఇండస్టీని గుప్పిట్లో పెట్టుకున్నా, ఒకేసారి వందలు వేల ధియేటర్లలో రిలీజ్ చేసి, ప్రేక్షకుడిని వేరే చాయిస్ అంటూ లేకుండా చేసి, నిర్బంధంగా సినిమా చూపించి కోట్లకుకోట్లు కొట్టేయాలనే ఎత్తుగడల్ని ఈ ఏడాది విడుద‌లైన సినిమాల్ని దారుణంగా పటాపంచలు చేసిన తీరు ఒక మెసెజ్. ఆద్యంతం ఉత్కంఠను రేపే ఓ చిన్న సినిమా క్షణం. హిట్, మరో చిన్న సినిమా ఎక్స్ ప్రెస్ రాజ్. హిట్, నాగార్జునను మళ్లీ సరికొత్తగా ప్రజెంట్ చేసిన సోగ్గాడే చిన్ని నాయనా. హిట్, అసలు తెలుగు సినిమా నివ్వెరపోయేలా ఓ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు. సూపర్ హిట్, తెరపై ఓ మంచి ప్రయోగం ఊపిరి. అఆ, జెంటిల్ మేన్. హిట్స్. షార్ట్ ఫిలిం రేంజ్‌లో ఉన్నా స‌రే భారీ హిట్ ను ఇస్తామంటూ పెళ్లిచూపులు సినిమాను ఎక్క‌డో నిల‌బెట్టాడు ప్రేక్ష‌కుడు. ఇవన్నీ ఒక్కసారి విశ్లేషించుకుంటే స‌గ‌టు ప్రేక్షకుడు ఏం కావాలని కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. 


అయినా స‌రే పెద్ద హీరోలు మార‌డం లేదు. సౌతిండియా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్, టాలీవుడ్ పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సౌతిండియా స్టార్ హీరో విక్ర‌మ్.. ఇలా స్టార్ హీరో సినిమాల‌న్నీ బోల్తా ప‌డుతున్నాయి. ఒక బ్ర‌హ్మోత్స‌వం, ఒక స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్, ఒక క‌బాలీ,  ఒక ఇంకొక‌డు.. రేపు మ‌రొక‌టి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. మ‌న భారీ బ‌డ్జెట్ సినిమాకు ఏమైందో..? ఎవ‌రిది త‌ప్పో అంద‌రికి అర్థ‌మ‌వుతోంది. స్టార్ హీరోల తీరుతో సౌతిండియా సినీ ప‌రిశ్ర‌మ‌నే త‌ల్ల‌డిల్లుతోందన్న‌ది నిజం. 


ఈ ఏడాదిలో ఈ న‌వ మాసాలు (జ‌న‌వ‌రి-సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కు) జ‌రిగిన‌ అనుభవాలు ఇప్పటికైనా నిర్మాతలు, దర్శకులు, హీరోల కళ్లు తెరిపించాలి. స్టార్ హీరోల హీరోయిజం, ఇమేజీ, తొక్కాతోలు సినిమాను అణువంతైనా కాపాడలేవనీ, స్టార్ హీరో ఫాలోయింగ్ అట్టర్ ప్లాప్ సినిమాను ఏమాత్రం కాపాడలేవనే నిజం ఇప్పటికైనా అర్థం కావాలి. మితిమీరిన హీరోయిజం, కాలం చెల్లిన చెత్త ఫార్ములా, సూపర్ మ్యాస్ ఫైట్లు, సర్కస్ ఫీట్ల డ్యాన్సులు, అస్తవ్యస్త కథ‌నాలు, వెకిలి కామెడీ ట్రాకులు, భుజకీర్తులు, భజనకీర్తనలతో సినిమాలు తీసి ఇక తెలుగు ప్రేక్షకుడిని మెప్పించలేమనే చేదు వాస్తవం ఇకనైనా వారి మెదళ్లకు ఎక్కాలి. ఎక్కించాలి. అప్పుడే మ‌న ప‌రిశ్ర‌మ బాగుప‌డుతుంది. సినీ ఇండ‌స్ట్రీకి మంచి రోజులొచ్చాయ‌ని 24క్రాప్ట్స్ పండ‌గ చేసుకుంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: