తాంత్రిక విద్యలతోనూ భయపెట్టే తంత్ర?

Chakravarthi Kalyan
సోసియల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అనన్య నాగళ్ల...'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాలతో పాపులర్ అయింది. తాజాగా ‘తంత్ర’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లకు ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. అనన్య తోపాటు హీరో శ్రీహరి తమ్ముడు కుమారుడు ధనుష్ రఘుముద్రి నటించారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మించారు.  మరి ఇది ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: చిన్నతనంలో తల్లి(సలోని)ని కోల్పోయి తండ్రి పెంపకంలో పెరిగిన ఓ అందమైన గ్రామీణ యువతి రేఖ(అనన్య నాగళ్ల). ఆమెను అదే గ్రామానికి చెందిన తేజు(ధనుష్ రఘుముద్రి) ప్రేమిస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒకరికొకరంటే ప్రేమానురాగాలుంటాయి. వీరిద్దరూ మరో ఇద్దరు కలిసి కాలేజీ చదువుతుంటారు. రేఖకు చీకటి అంటే చచ్చేంత భయం. ఆమెను ఏవో కొన్ని శక్తులు పీడిస్తూ ఉంటాయి. ఆమెకు ఎవరికీ కనిపించని శక్తులు కొన్ని ఆమెకే కనిపిస్తాయి. దాని వల్ల ఆమె ఓ బాబా దగ్గర ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ ఆమెను ఓ శక్తి పీడిస్తూ... తన రక్తాన్ని తాగేంత వరకూ వదలదు. అలాంటి రేఖ... జీవితం ఎందుకు ఇలా మారింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే...
గతంలో వచ్చిన మసూద, విరూపాక్ష సినిమాలు తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలతో తెరకెక్కి ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో ‘తంత్ర’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి. ఈ సినిమాకి రాసుకున్న ప్రధాన ప్లాట్  కూడా తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలతో ముడిపడి ఉంది. అయితే దానికి పురాణ గాథలను జోడించి తెరకెక్కించారు. పురాణాల్లో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, క్షుద్రదేవత అయిన నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు... ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేసి ఇంద్రజిత్తు తలపెట్టిన క్షుద్రపూజను భగ్నం చేస్తాడు... కథనాన్ని ఆసక్తిగా చెప్పేందుకు రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవి విభాగాలుగా ఎంచుకుని తెరకెక్కించారు దర్శకుడు. ఈ ఎపిసోడ్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా వజ్రోలి రథి.. ఎపిసోడ్ ను టెంపర్ వంశీ, సలోని మీద తీసిన తీరు బాగా ఎంగేజ్ చేస్తుంది. ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా అనన్య నాగళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో తాంత్రిక విద్యలతో కొన్ని ఎపిసోడ్స్ ను చూపించి... సెకెండాఫ్ లో క్షుద్రపూజలతో రక్తికట్టించారు సినిమాని.

అనన్య నాగళ్ల సినిమా మొత్తం అన్నీతానై సినిమాను ముందుకు నడిపించింది. హారర్, గ్లామర్ పాత్రల్లో బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటి లాగే తనదైన శైలిలో నటించి యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ధనుష్ రఘుముద్రి కూడా మొదటి సినిమానే అయినా బాగా నటించి మెప్పించారు. క్షుద్రపూజలు చేసి... అమ్మాయిలను వశం చేసుకునే భయంకరమైన మాంత్రికుడి పాత్రలో టెంపర్ వంశీ ఆక్టుకున్నాడు. చాలా కాలంత రువాత ‘మర్యాదరామన్న’ బ్యూటి సలోని ఇందులో నటించింది. ఉన్నది కాసేపే అయినా... తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాసుకున్న స్టోరీ దాన్ని ముందుకు నడిపించేందుకు రాసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తిరంగా ఉన్నాయి. చివరి దాకా సస్పెన్స్ కూడా తీసుకెళ్లి... ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచారు. సంగీత దర్శకుడు వంద శాతం న్యాయం చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బావుండేది. ఇలాంటి జోనర్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా మంచి ఛాయిస్. ఈ వారాంతంలో సరదాగా చూసేయండి.

రేటింగ్‌- 2.75

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: