అచ్చం పూరీ జగన్నాధ్ లానే చేస్తున్న చిరంజీవి..ఇండస్ట్రీలో కొత్త ఛాప్టర్ స్టార్ట్..!
ఈ సందర్భంగా పాడ్‌కాస్ట్ ప్రారంభించాలన్న ఆలోచనను చిరు మీడియాతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆయన కూతురు సుష్మిత కొణిదెలతో పాటు, ప్రముఖ రచయిత-దర్శకుడు బీవీఎస్ రవి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. చిరంజీవి సినీ ప్రయాణం నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. ఈ దీర్ఘ ప్రయాణంలో ఆయన మూడు తరాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో ఆయన సంపాదించుకున్న అనుభవాలు, జ్ఞాపకాలు అనేకం.సాధారణంగా చిరంజీవి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా అరుదు. ఇచ్చినా, అవి ఎక్కువగా ప్రస్తుత సినిమాలు, విడుదలకు సిద్ధమైన ప్రాజెక్టుల వరకే పరిమితమవుతుంటాయి. ఒకప్పటి జ్ఞాపకాలు, ఇండస్ట్రీలో జరిగిన ఆసక్తికర సంఘటనలు, తన వ్యక్తిగత అనుభవాలను విపులంగా చెప్పుకునే అవకాశం ఆయనకు పెద్దగా దొరకలేదు. ఈ లోటును పాడ్‌కాస్ట్ ద్వారా భర్తీ చేయాలన్న ఆలోచన చిరంజీవిలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాడ్‌కాస్ట్ ద్వారా తనకు నచ్చిన అంశాలు, సినీ జీవితంలో ఎదురైన మధురానుభవాలు, సవాళ్లు, విజయాలు, అపజయాలను అభిమానులతో నేరుగా పంచుకోవాలన్నదే చిరు అభిమతంగా కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ డిజైన్ బాధ్యతను బీవీఎస్ రవి తీసుకున్నారని సమాచారం. ఇటీవల నందమూరి బాలకృష్ణతో బీవీఎస్ రవి రూపొందించిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే తరహాలో చిరంజీవి పాడ్‌కాస్ట్‌ను కూడా మరింత ఆసక్తికరంగా రూపొందించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.
గతంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు యాంకర్ సుమతో కలిసి తన జీవిత అనుభవాలను పంచుకున్న టీవీ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ కార్యక్రమం అప్పట్లో అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచింది. పూరీ జగన్నాధ్ కూడా ఇదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అదే స్థాయిని మించి, మరింత విస్తృతమైన స్పందనను చిరంజీవి పాడ్‌కాస్ట్ తీసుకురావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.ఒక లెజెండరీ నటుడిగా, కోట్లాది అభిమానులకు ఆదర్శంగా నిలిచిన చిరంజీవి తన జీవిత కథలను పాడ్‌కాస్ట్ రూపంలో చెప్పడం నిజంగా ప్రత్యేకమైన అనుభవంగా మారనుంది. ఈ పాడ్‌కాస్ట్ అధికారికంగా ప్రారంభమైతే, మెగాస్టార్ అభిమానులకు ఇది ఒక అరుదైన విందుగా మారడం ఖాయం.