2026 టాలీవుడ్ సంక్రాంతి స్పెష‌ల్ ... !

RAMAKRISHNA S.S.
సంక్రాంతి పండుగ సీజన్ బాక్సాఫీస్ వద్ద ఎందుకు ఇంత ప్రత్యేకమో ఈ ఏడాది వసూళ్లు మరోసారి నిరూపిస్తున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే టాలీవుడ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ పండుగ బరిలో నిలిచిన ఐదు చిత్రాలు తమ పరిధిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండటం విశేషం. అన్నింటికంటే మిన్నగా మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన ఐదవ రోజు కూడా అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటం చిరంజీవి మాస్ పవర్‌కు నిదర్శనం. ఈ వారాంతంలో కూడా టికెట్లు దొరకడం గగనంగా మారిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పండుగ సెలవులు ముగిసినా ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆదరణ తగ్గకపోవడం గమనార్హం.


మెగాస్టార్ సినిమాతో పాటు మిగిలిన చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. నవీన్ పొలిశెట్టి నటించిన “అనగనగా ఒక రాజు” పండుగ వినోదంలో సెకండ్ ప్లేస్‌లో నిలుస్తూ అదరగొడుతోంది. ప్రారంభం నుండి ఈ చిత్రానికి టికెట్ల కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది. అలాగే చివరగా విడుదలైన శర్వానంద్ చిత్రం “నారీ నారీ నడుమ మురారి” కూడా తక్కువ థియేటర్లలోనే అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా శుక్రవారం నుండి శర్వానంద్ సినిమాకు ఆదరణ ఒక్కసారిగా పెరిగింది. శని, ఆదివారాల్లో కూడా ఈ చిత్రానికి బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటంతో శర్వానంద్ ఖాతాలో మరో సంక్రాంతి హిట్ చేరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరోవైపు యావరేజ్ టాక్ సంపాదించుకున్న చిత్రాలు సైతం సంక్రాంతి సీజన్ పుణ్యమా అని లాభాల బాట పట్టాయి. రవితేజ నటించిన “భర్త మహాశయులకు విజ్ఞప్తి” ప్రారంభంలో కొంత మందకొడిగా సాగినా, క్రమంగా పుంజుకుని శుక్రవారం నాటికి మంచి వసూళ్లు సాధించింది. ఇక అన్నిటికంటే ఎక్కువ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ప్రభాస్ చిత్రం “రాజా సాబ్” కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడటం విశేషం. ప్రభాస్ స్టార్ ఇమేజ్ తో పాటు పండుగ సెలవులు ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. మిగిలిన పెద్ద సినిమాలకు టికెట్లు దొరకని ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపుతుండటంతో వసూళ్లు నిలకడగా ఉన్నాయి. నెగెటివ్ టాక్ ఉన్నా సీజన్ అడ్వాంటేజ్ వల్ల సినిమా ఎలా గట్టెక్కుతుందో ఇది ఒక ఉదాహరణగా నిలిచింది.


ఒకేసారి ఐదు సినిమాలు విడుదలై, అన్నీ విజయపథంలో సాగడం సినీ పరిశ్రమలో అరుదైన పరిణామం. గత ఏడాది నిరాశపరిచిన ఫలితాల నుండి టాలీవుడ్ కోలుకోవడానికి ఈ సంక్రాంతి సీజన్ ఒక గొప్ప ఊతాన్ని ఇచ్చింది. ఇంటర్నెట్‌లో అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఐదు సినిమాలు కలిపి మొదటి వారంలోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఈ సీజన్ కోసం పోటీ పడతారో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2026 సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైన విజయాలను అందించబోతోందనే సంకేతాలు ఈ సినిమాల ద్వారా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: