సావిత్రి @ 90Years: అసలు మహానటి అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా..?

Thota Jaya Madhuri
“నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోయితే, నిబిడాశ్చర్యంతో వీరు…”అని కవిసామ్రాట్ శ్రీశ్రీ రాసిన ఆ అద్భుతమైన పాదాలు, నిజ జీవితంలో మహానటి సావిత్రి గురించే రాసినట్లుంటాయి. ఎందుకంటే ఆమె కళాజీవితం, ఆమె ఎదుగుదల, ఆమె ప్రతిభ, నిజంగా ఆశ్చర్యకర ఘట్టాలతో నిండిన ఒక అద్భుత ప్రయాణం. నేటి తరానికి కూడా చిరస్థాయిగా నిలిచే ఆమె పేరు, గౌరవం—‘మహానటి’ అనే బిరుదుకు తగ్గట్టుగానే ఉన్నాయి.



పుట్టుక – బాల్యం:

కొమ్మారెడ్డి సావిత్రి 1935 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, గురవయ్య. కానీ విషాదకరంగా ఆమె పుట్టిన ఆరు నెలలకే తండ్రి గురవయ్య చనిపోవడంతో చిన్న సావిత్రి తన పెద్దమ్మ దుర్గాంబ, పెదనాన్న వెంకటరామయ్యల వద్ద విజయవాడలో పెరిగింది. చిన్నప్పటి నుంచే నాట్యం, నటన, కళల మీద వెర్రి ఆసక్తి చూపుతూ, చదువు ఎనిమిదో తరగతివరకే ఆగిపోయింది.సావిత్రిపై అప్పట్లోనే అంజలీదేవి అంటే అపారమైన అభిమానం ఉండేది. ముఖ్యంగా ‘బాలరాజు’ (1948) చిత్రంలో అంజలీదేవి చేసిన‘తీయని వెన్నెలరేయి’ పాటకు ఆమె చేసిన నాట్యం సావిత్రిని అమితంగా ఆకట్టుకుంది. అప్పటి నుండి చిన్న ప్రదర్శనల్లో, నాట్యకార్యక్రమాల్లో అదే పాటను తప్పనిసరిగా అభినయిస్తూ అందరి మెప్పును పొందేది.



నాట్య ప్రస్థానం – తొలి గుర్తింపు:

విజయవాడలో కళాభిమాని సుంకర కనకారావు ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ నాట్యమండలి ప్రదర్శనల్లో సావిత్రి రెగ్యులర్‌గా పాల్గొనేది. ఈ ప్రదర్శనలలోనే ఆమె ప్రతిభ కనిపించి, అనేక మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.అప్పట్లో ప్రముఖ నటుడు జగ్గయ్యగారు తన నాట్యబృందంతో కలిసి సావిత్రిని కాకినాడలో జరిగిన అఖిల భారత నృత్య–నాటిక పోటీలకు (1948) తీసుకెళ్లారు. ఆ పోటీలకు ప్రముఖ హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రికి స్వయంగా బహుమతి అందించారు.అది ఆమె కళాజీవితంలో మరచిపోలేని ప్రధాన ఘట్టం. చిన్న వయసులోనే అంతటి మహానుభావుడి చేత ప్రశంసలు అందుకోవడం, ఆమెకు మరింత నమ్మకం ఇచ్చింది.



సినిమాలో తొలి అడుగు:

కాకినాడ పరిషత్ పోటీలు ముగిసి నెలరోజులలోపు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గోకులకృష్ణా ప్రతినిధి అయిన సి.వి. కృష్ణమూర్తి విజయవాడకువచ్చి సావిత్రిని కలిశారు. వారితో పాటు నిర్మాతలు రంగనాథదాసు, కె.సి.కృష్ణ కలిసి తీస్తున్న ‘సంసారం’ (1950) చిత్రంలో రెండో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు.ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం—ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, సూర్యకాంతం, లక్ష్మీరాజ్యం, పుష్పలత వంటి తారలు.యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సావిత్రి ‘కమల’ పాత్రలో నటించేందుకు మద్రాసు వెళ్లి అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. మొదటి షెడ్యూల్ పక్షం రోజుల పాటు సాగి, ఆమె నటనను చూసిన ప్రతి ఒక్కరూ ఆమె భవిష్యత్తు పెద్దదేనని అప్పుడు నుంచే చెప్పేవారు.



‘మహానటి’ అనే బిరుదు ఎలా వచ్చింది?

భారతీయ సినిమా చరిత్రలో ఏ పాత్ర ఇచ్చినా అచ్చం ఆ పాత్రగానే మారిపోయి నటించడం సావిత్రి ప్రత్యేకత.డ్రామా, కామెడీ, భావోద్వేగం, విషాదం, నాట్యం—ఏది కావాలన్నా ఆమెకి అవలీలగా వచ్చేది. కెమెరా ఆన్ అయ్యే సరికి సావిత్రి అనే వ్యక్తి మాయం… పాత్ర మాత్రమే కనిపించేది.‘మాయాబజార్’లో శశిరేక’గా ఆమె చేయి చాపిన క్షణం..‘చివరాకి మిగిలేది’లో గుండెపోటుతో కుప్పకూలే సీన్..‘మిస్సమ్మ’లో ఆమె చేసిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్..‘గుండమ్మకథ’లో అమాయక వధువు..‘దేవదాసు’లో పార్వతి హృదయ వేదన..ఇవి అన్నీ ఆమెనే కాదు—సినిమా చరిత్రను నిలబెట్టిన పాత్రలు. సినిమా రంగంలోని ప్రముఖులు, విమర్శకులు, ప్రేక్షకులు అందరూ ఒకే మాట చెప్పారు. “ఇంత అద్భుత నటన చేసే నటి, ఇంత భావప్రపంచం చూపగల నటి… నిజంగా మహానటి!”.అందుకే ఆమె పేరుకు ముందు ‘మహా నటి’ అనే బిరుదు శాశ్వతంగా చేరిపోయింది. ఆ బిరుదు ఆమె సంపాదించినది కాదు—ఆమె సాధించినది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: