అఖండ 2 ఎందుకు ఆగింది.. అసలేం జరిగింది... ?
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇలా జరగడం మొదటి సారి అనుకోవాలి. మరో రెండు .. మూడు గంటల్లో ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయని అందరూ షో చూసేందుకు సిద్ధమవుతోన్న టైంలో ఊహించని షాక్. ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయని మెల్లగా చెప్పారు. తర్వాత అసలు సినిమాయే రిలీజ్ కావడం లేదని వాయిదా పడుతోందని చెప్పేశారు. ఒక్కసారిగా అభిమానుల్లో తీవ్ర నిరాశ , నిస్పృహలు కలిగాయి. ఇలా జరగడం బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ టైం .. అది కూడా భారీ అంచనాలు మధ్య రిలీజ్ అవుతోన్న అఖండ 2కే జరిగింది. బాలయ్య వరుసగా నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ టైంలో భారీహైప్‌తో వస్తోన్న అఖండ 2 సినిమా రిలీజ్ ముంగిట వాయిదా పడడం అభిమానులు అస్సలు జీర్ణించుకో లేకపోతున్నారు.
గతంలో నిప్పురవ్వ లాంటివి నిర్మాణంలో ఆలస్యం అవ్వడంతో ఫ్యాన్స్ యేళ్ల పాటు సినిమా కోసం ఎదురు చూపులు చూశారు. తీరా విడుదల తేదీ రోజు పోస్ట్ పోన్ అవ్వడం అనేది మాత్రం ఫస్ట్ టైం జరిగింది. థియేటర్ వద్ద పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశ నిస్పృహల తో వెనుదిరుగుతోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా వాయిదా వెనక చాలా కారణాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఇదే 14 రీల్స్ మహేష్ బాబుతో నిర్మించిన దూకుడు సినిమాతో మంచి లాభాలు వచ్చాయి. అయితే తర్వాత అదే మహేష్ తో తీసిన వన్ - ఆగడు రెండు బిగ్ డిజాస్టర్లు అయ్యాయి.
ఈ రెండు సినిమాల విషయంలో ఎరోస్ సంస్థతో 14 రీల్స్ వాళ్లకు లావాదేవీలు ఉన్నాయి. అవి క్లీయర్ కాలేదు. ఆ తర్వాత సర్కారువారి పాట సినిమా అదే కాంబినేషన్.. బ్యానర్లో వచ్చినా ఆ సినిమాకు అనుకున్న లాభాలు అయితే రాలేదు. దీంతో ఆగడు, వన్ బాకీలు అలాగే ఉండిపోయాయట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కాని.. ఈ విషయంలోనే సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయంటున్నారు. గత రాత్రి కొందరు ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసినా శుక్రవారం కూడా సినిమా రిలీజ్ కాని పరిస్థితి. ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించుకుని డిసెంబర్ 12, 19 25 ఈ మూడు డేట్లలో ఒకటి లాక్ చేసుకునే పనిలో ప్రొడ్యూసర్లు బిజీగా ఉన్నారట.